Telangana Paddy Procurement Issue: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రోహిణి కార్తెకు వేళ అవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని.. రైతుల ఆవేదనను, ఆందోళనను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో తిప్పన్నపేట ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోళ్ల తీరును నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన చేశారు. రైతుల ధర్నాకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఐకేపీ కేంద్రం వద్ద గంటకు పైగా రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రికి కాలాలపై అవగాహన ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 


ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోళ్లలో జాప్యం


అకాల వర్షాలు కురిసి పంట తడిసి రాష్ట్రంలో అన్నదాతలు ఆగమైపోతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. మరోవైపు కొనుగోళ్లలో ప్రభుత్వ జాప్యంతో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇంతా జరిగితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో అన్నదాతలను నిలువునా దోపిడి చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఒక రైతుకు చెందిన ధాన్యం 106 క్వింటాళ్లకు 6.90 కిలోల కోత విధించారని తెలిపారు. ఇప్పటికే రైతు బంధు పేరుతో అన్నదాతలకు కల్పించాల్సిన రాయితీలు, సౌకర్యాలు దూరం చేశారని అన్నారు. పంట చేతికొచ్చాక కొనుగోళ్ల తీరుతో ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధికారులను కొనుగోళ్ల విషయం గురించి అడిగితే.. లారీలు ఇప్పుడే పంపిస్తామంటారు కానీ పంపించడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. 


కామారెడ్డి జుక్కల్ లో రైతుల ధర్నా


కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వరి ధాన్యం రైతులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. మొహ్మదాబాద్, కేంరాజ్ కల్లాలి, ఖండేబల్లూర్ తదితర గ్రామాల అన్నదాతలు జాతీయ రహదారి 161పై బైఠాయించారు. జుక్కల్ మండలంలో సింగిల్ విండో ద్వారా మొహ్మదాబాద్, కౌలాస్, కల్లాలి, ఖండేబల్లూర్ లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తూకం వేసి వారాలు గడుస్తున్నాయి. అయినా లారీలు లేవని చెబుతూ అధికారులు ధాన్యం తరలించడం లేదు. దీంతో వరి ధాన్యం వద్దే రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇంకా దాదాపు 20 వేల క్వింటాళ్ల ధాన్యం తూకం వేయాల్సి ఉందని తెలిపారు. వారాల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం మార్పులు కారణంగా వానలు పడితే తమ పరిస్థితి ఏమిటని అన్నదాతలు వాపోతున్నారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ గణేశ్, ఎస్సై మురళి రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు. వారు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా రైతులు ససేమిరా అన్నారు. లారీలు పంపించాలని, ధాన్యం మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు అన్నదాతలను సముదాయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.