ఇకపై స్కూల్లో విధులకు డుమ్మా కొట్టే వారితో పాటు, అనధికారిక సెలవులు పెట్టే ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆటలకు చెక్ పడనుంది. అటు తూతూ మంత్రంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఇటు ప్రైవేటుగా రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్స్ తో పాటు ఇతర బిజినెస్ లో బిజీగా ఉంటున్న కొందరు టీచర్లకు చెక్ పెట్టే విధంగా కొత్తగా ఈ విధానం అమలు కాబోతుంది. బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్ర విధులకు హాజరు అయినట్లు లెక్క చూపబోతుంది.


 కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసేందుకు సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే  జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయుల హాజరుపై దృష్టి సారించి సర్కార్ ను బలోపేతం చేసేందుకు చేస్తున్నారు.


 కరీంనగర్ జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలుండగా, వాటిల్లో 28 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. 623 పాఠశాలల్లో ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరును అమలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 488 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 472 పాఠశాలలో బయోమెట్రిక్ విధానం అమలు కానుంది. ఇదివరకు 2017-18 విద్యా  సంవత్సరంలో కూడా ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ విధానం జిల్లాల వారీగా 25 శాతం పాఠశాలల్లో అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమైనా ఈ ప్రయత్నం ఫలించలేదు. 


పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఈ విధానం ప్రస్తుతం అమలు అవుతుండడంతో ఉపాధ్యాయుల హాజరు పారదర్శకంగా నిలుస్తోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడం సాయంత్రం పాఠశాల సమయానికి ముందే తాళం వేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. వేలిముద్ర చేయనిదే ఆ రోజు ఉదయం సాయంత్రం హాజరు పడదు. ఇందుకోసం చైల్డ్ ఇన్ఫో లో పాఠశాలల వారీగా ఆధార్ వివరాలతో నమోదు చేసిన ఉపాధ్యాయుల వివరాలను బయోమెట్రిక్ యంత్రంలో పొందుపరుస్తున్నారు. 


వారు పాఠశాలలకు ఉదయం హాజరైన సమయం సాయంత్రం సమయం కూడా నమోదవుతుంది.సమాచారం జిల్లా రాష్ట్ర విద్యాశాఖకు అనుసంధానం అవుతుంది. బయోమెట్రిక్ హాజరు తోడు నిత్యం ప్రధానోపాధ్యాయులు సంబంధిత అధికారులకు హాజరు వివరాలను పంపించాల్సి ఉంటుంది. ఏదైనా కారణాలతో పరిగణలోకి తీసుకుంటారు. వారం పది రోజుల్లో జిల్లాల వారీగా బయోమెట్రిక్ యంత్రాలు వాటిల్లో ఉపాధ్యాయుల వివరాలను నమోదు చేసి పూర్తి చేసి వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. 


ఒకవైపు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివి పేద విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తున్న ఇలాంటి సిబ్బందికి చెక్ పెట్టడం ద్వారా ప్రతి ఏటా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. శాఖా పరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ.. కొందరి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న రిమార్క్ ని తొలగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న బయోమెట్రిక్ హాజరు నిర్ణయం వెంటనే అమలు చేయాలని సంకల్పించింది.


Also Read: Weather Latest Update: మరో 2 రోజులు వర్షాలే, ఇంకో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్! ఈ ఏరియాలకు ఎల్లో అలర్ట్