తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి లిట్మస్ టెస్ట్ ఎదురైంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉవ్వెత్తున ఎగసి... ఇక మేమే ప్రత్యామ్నాయం అనుకున్న సమయంలో... ఒక్కసారిగా వెనక్కి పడిపోవడం.. బీజేపీ నేతలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. దుబ్బాక ఉపఎన్నికల్లో అనూహ్యమైన గెలుపు.. గ్రేటర్‌లో ఒక్కసారిగా పీఠం దరిదాపుల్లోకి ఎదిగిపోవడం వంటి పరిణామాలతో బీజేపీకి వచ్చిన ఊపు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్, మినీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో పూర్తిగా చప్పబడిపోయింది.  



దుబ్బాక, గ్రేటర్ తర్వాత ఒక్కసారిగా టీ బీజేపీకి హైప్..!


తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటి వరకూ ఎలుగెత్తి చాటుతున్న భారతీయ జనతా పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నిక, మినీ మున్సిపల్ ఎన్నికలు షాకిచ్చాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో వచ్చిన హైప్ తగ్గిపోయింది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  హైదరాబాద్ సిట్టింగ్ సీటును బీజేపీ కోల్పోవడం.. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. చివరికి గ్రేటర్ హైదరాబాద్‌లో తమ సిట్టింగ్ కార్పొరేటర్ చనిపోతే జరిగిన లింగోజిగూడ కార్పొరేటర్ స్థానంలో  కూడా బీజేపీ అభ్యర్థిని గెలుచుకోలేకపోయింది. టీఆర్ఎస్ మద్దతు తీసుకున్న ప్రయోజనం లేకపోయింది. వరంగల్, ఖమ్మం వంటి చోట్ల జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల ప్రభావం చూపగలిగినా...  అతి తాము చెప్పే ప్రత్యామ్నాయం స్థాయిలో లేదు.  


సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ వరకూ మళ్లీ పరాజయాల బాట..!



ఇప్పుడు బీజేపీకి మరో ఛాన్స్ వచ్చింది. అదే హుజూరాబాద్ ఉపఎన్నిక. స్వయంగా కేసీఆరే.. ఈ ఛాన్స్ ఇస్తున్నారు. అంతర్గతంగా ఏం జరిగిందో కానీ.. ఈటల టీఆర్‌ఎస్‌ను  వీడారు. బీజేపీలో చేరారు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఉపఎన్నికను ఎదుర్కోవడంలో కాస్త కూడా తడబడకూడదు కాబట్టి... రంగంలోకి కూడా దిగారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఎప్పుడూ బలం లేదు. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పదహారు వందల ఓట్లు మాత్రమే వచ్చాయి.  కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పాతుకుపోయిన ఈటల రాజేందర్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కాబట్టి... బీజేపీ రేసులోకి వచ్చినట్లే. ఇక్కడ ఈటల ఓడిపోతే... ఈటలకు ఎంత నష్టం జరుగుతుందో.. బీజేపీకి అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే... బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. 


హుజూరాబాద్‌లో గెలిస్తేనే మళ్లీ రేసులో ఉన్నట్లు ..!



ఈటల రాజేందర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినట్లైతే.. అన్నివర్గాల మద్దతు లభించేదని ఇప్పటికే కొంత మంది విశ్లేషణలు చేస్తున్నారు. కానీ ఆయన బీజేపీలో చేరడం వల్ల...  చాలా మంది మద్దతు కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. అంటే.. ఒక వేళ ఈటల కనుక ఓడిపోతే.. ఆ ఓటమి ఈటలది కాదని.. బీజేపీదనే ప్రచారం చేస్తారు. ఇది మరింత డ్యామేజ్. పడిపోయిన హైప్‌ను మళ్లీ పెంచుకోవాలన్నా... బీజేపీ వల్లనే ఈటల గెలిచారన్న పేరు రావాలన్నా.. కచ్చితంగా హుజూరాబాద్‌లో బీజేపీ గెలవాల్సి ఉంది. కానీ బీజేపీలో ఇప్పుడు ఆ జోష్‌ కనిపించడం లేదు. ఒక్కొక్క నేత పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దళిత వర్గంలో ముఖ్యంగా మాదిగ సామాజికవర్గంలో పేరున్న మోత్కుపల్లి నర్సింహులు గుడ్ బై చెప్పారు. హుజూరాబాద్‌లో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా... పార్టీ దూరంగా ఉంటున్నారు. 


తెలంగాణ బీజేపీకి ఓ రకంగా చివరి ఛాన్స్..! 



ప్రత్యేకంగా కేసీఆర్ కోరుకుంటే తప్ప.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు... మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇతర ఏ ఎన్నికలు కూడా లేవు. బీజేపీ పుంజుకుంది అని నిరూపించుకోవడానికి ..ఇదే చివరి అవకాశం. అనుకున్నది అనుకున్నట్లుగా విజయం సాధిస్తేనే భారతీయ జనతా పార్టీ కాస్త ముందుకొస్తుంది. లేకపోతే.. మళ్లీ రాజకీయం మారిపోతుంది.  కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి మారుతుంది. అప్పుడు బీజేపీ హైప్ అంతా కరిగిపోయినట్లవుతుంది. అందుకే ఇప్పుడు బీజేపీకి లిట్మస్ టెస్ట్‌గా చెప్పుకోవచ్చు.