Superstar Krishna Passed Away: తన సినీ ప్రయోగాలతో అశేష అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ అంటే పడి చచ్చే అభిమానులు ఆ రోజుల్లో చాలామంది ఉండేవారు. అందరికంటే ఎక్కువ అభిమాన సంఘాలు హీరో కృష్ణకే ఉండేవని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. కేవలం సినిమాల్లో హీరోయిజమే కాదు.. బయట సింప్లిసిటీతోను చాలామందిని తనకు అభిమానులుగా మార్చుకున్నారు. ఆయన అలాంటి హీరో కృష్ణకి ఉన్న ఫ్యాన్స్‌లో ఒక డై హార్డ్ ఫ్యాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో ఉండేవారు. ఆయన విశేషాలు తెలిస్తే వావ్ అంటారు.


అసలే అది తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతున్న రోజులవి. అప్పటివరకూ కుటుంబ కథా చిత్రాలు... రెగ్యూలర్ స్టోరీలు, సమాజం అంశాలతో కూడుకున్న సినిమాలు మాత్రమే వస్తున్న వేళలో రకరకాల కౌ బాయ్, 70 ఎంఎం, ఈస్ట్ మన్ కలర్, జేమ్స్ బాండ్ లాంటి ఎన్నో షేడ్లని తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు హీరో కృష్ణ పరిచయం చేశారు. దీంతో అప్పటి యువతరం ఎక్కువగా హీరో కృష్ణ పిచ్చ ఫ్యాన్స్ గా మారిపోయారు. అందులో ఒకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన వకులాభరణం శ్రీనివాస్. ఆయన సింగరేణిలో ఉద్యోగిగా సేవలు అందించాడు.


వకులాభరణం శ్రీనివాస్ గురించి చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. తన నిజ జీవితంలో సైతం ఆయన రూపం.. డ్రెస్సింగ్ ఫ్యాషన్ కూడా సేమ్ టు సేమ్ హీరో కృష్ణ లాగే ఉండేది. కృష్ణ ఆయనపై అంతగా ప్రభావం చూపారు. ఇక గాగుల్స్ పెట్టుకొని ట్రెండీ ట్రెండీ ఫ్యాషన్ వేర్ తో 1970 వ దశకం సమయంలో గోదావరిఖని ప్రాంతంలో ఒక ఊపు ఊపారు. అంతేకాదండోయ్ ఆయనకు కృష్ణ అంటే ఎంత అభిమానం అంటే ఆయన సంతానంలో ప్రతి ఒక్కరికి కృష్ణ అనే చివరి పదం కలిసి వచ్చేలాగా పేరు పెట్టుకున్నారు. మొత్తం ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు పేరు మురళీకృష్ణ కాగా అమ్మాయి పేరు రమ్యకృష్ణ, ఇక చిన్నవాడైన అబ్బాయి పేరు రామకృష్ణ అని పెట్టుకున్నారు. వీరంతా ఇప్పుడు వేరే వృత్తుల్లో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు.  
తమ నాన్నగారు కృష్ణ ఫ్యాన్ గా ఉండడం మాత్రమే కాదు, ఆ అభిమానంతో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేశారన్నారు ఆయన చిన్న కుమారుడు రామకృష్ణ. దీన్నిబట్టే సూపర్ స్టార్ కృష్ణ అంటే ఏ రేంజ్ అభిమానం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక స్టైలిష్ గా తన రాజ్ దూత్ బండి నడుపుతూ... ఫుల్ లైఫ్ ని గడిపిన వకులాభరణం శ్రీనివాస్ దాదాపు పది ఏళ్ల క్రితం గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. 
గోదావరిఖని కృష్ణగా పేరు తెచ్చుకున్న ఆయన మెమరీస్ ని మాత్రం ఇప్పటికీ ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటారు. సరైన ఫిట్నెస్ తో... దానికి తగ్గ ఫ్యాషన్ తో అప్పటి తరాన్ని ఉర్రూతలూగించిన హీరో కృష్ణకి స్థానికంగా అసలు సిసలైన ఫ్యాన్ అనిపించుకున్నారు వకులాభరణం శ్రీనివాస్. బతికినన్ని రోజులు దిల్దార్గా తనకంటూ ఉండి, మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిగా.. తనకంటూ స్థానికంగా అభిమానులను స్థానికంగా సంపాదించుకున్నారు.