SSC Paper Leakage: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఇదే కేసు ఇప్పుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మెడకు కూడా చుట్టుకునేలా కనిపిస్తోంది. తాజాగా గురువారం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటలకు కూడా వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ డీసీపీ ఆఫీసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఈటలకు ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. అయితే శామీర్‌పేట‌లోని ఈట‌ల రాజేంద‌ర్ నివాసానికి క‌మ‌లాపూర్ పీఎస్ ఎస్ఐ నేరుగా వెళ్లి నోటీసులు అంద‌జేశారు. 


వరంగల్ డీసీపీకి లేఖ రాసిన ఈటల రాజేందర్


నోటీసులపై స్పందించిన ఈటల రాజేందర్ వరంగల్ డీసీపీకి లేఖ రాశారు. ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఈనెల 10వ తేదీన వస్తానని చెప్పారు. నేరుగా హన్మకొండ డీసీపీ కార్యాలయంలో 11 గంటల వరకు హాజరవుతానన్నారు. 


తన పాత్ర లేకపోతే బండి సంజయ్ ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు..?


మరోవైపు పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సంజ‌య్ పాత్ర లేక‌పోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది..? ఆయ‌న ఫోన్ ఇస్తే కీల‌క స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు..? ఆ ఫోన్ తెస్తే అంతా బ‌య‌ట‌ప‌డుతుంది..అని వరంగల్ సీపీ రంగనాథ్ చెబుతున్నారు. బండి సంజయ్ తన ఫోన్‌ను పోలీసులకు ఇవ్వలేదని లేదని చెబుతున్నారని ఆయన అంటున్నారు. కానీ బండి సంజయ్ తన ఫోన్ ను  ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్న సమయంలో కూడా ఉపయోగించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. మరి పోలీసులు ఆయన ఫోన్‌ను ఎందుకు తీసుకోలేదు? తీసుకుకోకుండ ఇవ్వలేదని చెబుతున్నారా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఫోన్ కావాలనే తీసుకోలేదని..  కోర్టుల్లో అదే విషయం చెప్పి బెయిల్ రాకుండా చేసే ప్రయత్నమని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రిమాండ్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది బండి సంజయ్ ఫోన్ ఇంకా ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బీజేపీ నేతుల ఇదే అంశంపై ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ ఫోన్ కు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా తాను ఫోన్ చేసి మాట్లాడానని బీజేపీ నేత డీకే అరుణ చెబుతున్నారు. దీంతో అసలు ఫోన్ రాజీకీయం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. 



మరో వైపు హైకోర్టులో బండి సంజయ్ రిమాండ్ రద్దు కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.  ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 7, 8, 9 మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయని బండి సంజయ్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు వాదించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. పేపర్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఓ పొలిటిషియన్ గా బండి సంజయ్ కు ప్రశ్న పత్రం వస్తే.. దానికే ఆయనను దోషిగా ఎలా పరిగణిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది.