సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాలు ముదిరి.. వీధిన పడటం రాజకీయ చర్చనీయాంశం అవుతోంది. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ జిందం కళాచక్రపాణికి వ్యతిరేకంగా ఏకంగా 27 మంది కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఇందులో కౌన్సిలర్ల సమస్యలపై.. వరుసగా జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం డబ్బులు వసూలు కౌన్సిల్‌లో చిచ్చు పెట్టింది.  డబ్బులు తీసుకున్న వారిని నిలదీయాల్సింది పోయి కౌన్సిల్ మొత్తం తప్పు చేసినట్లు అందరినీ దోషులుగా చూశారని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.


దీనికి తోడు మున్సిపల్ ఛైర్మన్ జింద కళ భర్త, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కౌన్సిల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. కౌన్సిలర్లకు గౌరవడం ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 9 సర్కిళ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కోసం రూ.1.10కోట్లతో కాంట్రాక్ట్ పనులు పొదుపు సంఘానికి ఇవ్వడానికి తీర్మాణంలో పెట్టడంతో ఈ వివాదం మొదలైనట్లు సమాచారం. ఈ పనిని ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి చేసుకుంటున్నట్లు కూడా సమాచారం. జూలై మాసంలో ఈ కాంట్రాక్ట్ కాలవ్యవధి ముగుస్తుండటంతో.. కొత్త వారికి ఈ కాంట్రాక్ట్ పనులు అప్పగించేందుకు ఛైర్మన్ భర్త జిందం చక్రపాణి రంగం సిద్దం చేస్తున్న క్రమంలో ఈ గ్రూపు రాజకీయాలు ముదిరి బహిర్గతం కావడం, ఏకంగా కేటీఆర్ ఇలాకాలో మున్సిపల్ చైర్మన్‌ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు మీటింగ్ నిర్వహించే వరకు వెళ్లింది. 


ఈ చర్చ కొనసాగుతున్న క్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు 20 మందికిపైగా ఒక బస్సులో హైదరాబాద్‌కు కేటీఆర్ వద్దకు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. తమ సమస్యలు మంత్రి కేటీఆర్‌కు చెబుతామని.. సిరిసిల్లకు వచ్చినప్పుడు తమ గోడు వినేందుకు సమయం ఇవ్వడం లేదని.. పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి సిరిసిల్ల టీఆర్ఎస్ రాజకీయాలు.. చినికి చినికి గాలివానగా మారుతున్నయన్న చర్చ కొనసాగుతుంది. సిరిసిల్ల టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య నెలకొన్న వివాదాల వల్లే ఈ రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం అంతర్గత గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.