పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి గనుల్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఈ మేరకు సింగరేణి బొగ్గుగనుల సంస్థ ప్రకటించింది. దీంతో మూడు రోజుల నుంచి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరికి విషాదాంతం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు (ఏఎల్‌పీ)లో ప్రమాదం నాలుగు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే.
మొదటి షిఫ్టులో 11:35 గంటలకు గనిలోని 86వ లెవల్, ఎల్‌సీ-3 వద్ద ఒక్కసారిగా పైకప్పు కూలింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, గని డిప్యూటీ మేనేజర్ తేజతోపాటు మైనింగ్ సర్దార్ పిల్లి నరేశ్, ఆపరేటర్ జోడి వెంకటేశ్, సపోర్ట్‌మెన్ ఎరుకల వీరయ్య, బదిలీ వర్కర్ రవీందర్, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ పైకప్పు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దాదాపు 3 మీటర్ల పొడవున, 20 మీటర్ల వెడల్పు పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. కార్మికులను రక్షించేందుకు అధికారులు రెస్క్యూ టీంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల తరువాత సపోర్టుమెన్ వీరయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా ఆరుగురిలో ఇద్దరి అరుపులు వినిపించడంతో శిథిలాలను తొలగించేందుకు చర్యలు వేగవంతం చేశారు. 8 గంటలు శ్రమించిన రెస్క్యూ టీం కొన ఊపిరితో ఉన్న జాడి వెంకటేశ్, నరేశ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.
అప్పటి నుంచి గల్లంతైన కార్మికుల కోసం గాలింపు చేపట్టగా తాజాగా వారి మృత దేహాలు లభ్యం అయ్యాయి. ఈ చనిపోయిన వారిలో అసిస్టెంట్ మేనేజర్ తేజ, సెఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందినట్లుగా సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు.
రెస్క్యూ చేప్టటిన టీమ్.. మొత్తానికి చనిపోయిన ముగ్గురు సిబ్బందిని బయటకు తీయగలిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా బయటపడగలిగారని, మరో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. ఏఎల్‌పీ బొగ్గు గనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెస్క్యూ టీం బయటకు తీసిన ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన దురదృష్టకరమని, సింగరేణిలో ఎలాంటి భద్రతా లోపాలు లేవని సింగరేణి డైరెక్టర్ బలరాంనాయక్ అన్నారు. సింగరేణిలోనే అత్యంత అధునాతన విదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్న అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు ప్రమాదంలో చిక్కుకుని ముగ్గురు మరణించడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.