Sister Murders Brother: తల్లి తర్వాత అంత బాధ్యత తీసుకోవాల్సిన ఓ సోదరి తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో సొంత తమ్ముణ్ని హత్య చేయించింది. జగిత్యాలలోని మెట్ పల్లి (Metpally News) పట్టణంలో ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు సంచలనం రేపుతోంది. సోదరితో సంబంధం నడిపిన ప్రియుడు లొంగిపోవడంతో ఆరు నెలల కిందట జరిగిన హత్య విషయం బయటపడింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ సుధాకర్ లతో కలిసి మెట్ పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాలలోని మెట్ పల్లి (Jagityal News) పట్టణంలో గల కళా నగర్‌లో నివాసముంటున్న మొహమ్మద్ అబ్దుల్ సోహైల్ (19) గత సంవత్సరం సెప్టెంబర్ 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడంటూ అప్పట్లో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, 6 నెలలకు ముందు సోహైల్ అక్క ఫాతిమా(21) తో సజ్జత్ అలీ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తన సోదరి ఫాతిమాను తీవ్రంగా హెచ్చరించాడు. అంతేకాకుండా తన స్నేహితుడైన ఓ మైనర్ బాలుడు కూడా ఆమెను బెదిరించాడు. అక్కాతమ్ముళ్ల మధ్య ఇక్కడే చెడింది. దీంతో తన తమ్ముణ్ని అడ్డు తొలగించుకోవాలని అనుకొన్న ఫాతిమా చంపితే లక్ష రూపాయలు ఇస్తానని.. తనను బెదిరించిన బాలుడితోనే ఒప్పందం చేసుకుంది. 


ఎలాగైనా సోహైల్‌ని అడ్డు తొలగించుకోవాలని భావించి పూర్తిస్థాయిలో ప్రణాళిక వేసింది. 2021 సెప్టెంబర్ 4న రాత్రి 8 గంటల ప్రాంతంలో సోహైల్ ని ఆ మైనర్ బాలుడు సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పక్కన ఉన్న దోబీ ఘాట్ వద్దకు తీసుకు వెళ్ళాడు. అక్కడ మరో స్నేహితుడు ఎండీ మహమ్మద్ (19) మైనర్ బాలుడు, సోహెల్ కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం వారి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అంతా కలిసి సోహైల్‌పై బీర్ సీసాలతో దాడి చేశారు. 


అంతటితో ఆగకుండా ప్రాణం తీయడానికి దగ్గర్లో దొరికిన చీరతో మెడకు ఉరి బిగించారు. ఇక శవాన్ని దొరకకుండా చేయాలని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పడేశారు. ఇన్నాళ్లు నేరం విషయంలో ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు కూడా కేసుని ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు. అయితే సోదరితో సంబంధం నడిపిన సయ్యద్ సజ్జాద్ అలీ అలియాస్ షాబాద్ (25)  మరోకరి సహకారంతో వచ్చి పోలీసులకు లొంగిపోవడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మిగతా నిందితులను కూడా అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. హత్య చేసిన నిందితులు ముందుకు వచ్చి లొంగిపోవడంతో కేసు వివరాలు బయటికి వచ్చాయి.