Siddipet News: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 8 వ రోజుకు చేరుకుంది. న్యాయవాదుల దీక్షకు బీజేపీ గిరిజన మోర్ఛ జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నాయకులు మద్దతు తెలిపారు. కోర్టులో విధులు బహిష్కరించి ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు జ్యుడీషియల్ వ్యవస్థ కానీ స్పందించడం లేదని న్యాయవాది సంపత్ వాపోయారు. గత ఆరు నెలలుగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యేకు, న్యాయశాఖ మంత్రికి, జ్యుడీషియల్ అధికారులకు దరఖాస్తు ఇచ్చి విన్నవించినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. లా సెక్రెటరీ నుంచి ప్రకటన వచ్చేవరకు తమ దీక్షను కొనసాగిస్తామన్నారు. 


"గత ఎనిమిది రోజులుగా మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు అధికారులు కానీ స్పందించలేదు. ఆరు నెలల నుంచి ప్రజా ప్రతినిధులకు, జ్యుడిషియల్ అధికారులు వినతి పత్రాలు అందజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం మాత్రమే మేము ఈ దీక్ష చేస్తున్నాం. హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈ దీక్ష ఇలాగే కొనసాగితే కక్షిదారులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కోర్టు ఏర్పాటుకు ఇస్తే బాగుంటుంది." - నిరసనకారుడు, న్యాయవాది 


"హుస్నాబాద్ లో గిరిజన ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లకు దగ్గర్లో అంటే హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడికి వచ్చేందుకు గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నరు. ఇంకా చాలా దూరంలో ఉన్న సిద్దిపేట వెళ్లేందుకు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఓసారి అధికారులు, ప్రభుత్వం ఆలోచించి.. హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. హామీ ఇచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం." - నిరసనకారుడు, న్యాయవాది


దీక్ష ఇలాగే కొనసాగితే కక్షిదారులు నష్టపోయే అవకాశం  ఉందని, రాష్ట్ర ప్రభుత్వం, జ్యుడీషియల్ అధికారులు స్పందించి తక్షణమే లా సెక్రటరీ ద్వారా సబ్ కోర్ట్ మంజూరు చేయించాలని న్యాయవాదులు కోరారు. బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు విషయమై 8 రోజులుగా న్యాయవాదులు దీక్ష చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారని, పలు కేసుల విషయంలో గిరిజనులు హుస్నాబాద్ కు వచ్చి హుస్నాబాద్ నుండి మళ్లీ సిద్దిపేటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హుస్నాబాద్ లోనే సబ్ కోర్టు ఏర్పాటు చేస్తే గిరిజనులకు, ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని వెంటనే హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.