Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెల్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే నేలబావిలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. చనిపోయిన వారిలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో ఈ దుర్ఘటన జరిగింది. 

Continues below advertisement

మృతులను దుబ్బాక మండలంలోని బల్వంతపూర్ గ్రామానికి చెందిన దుండుగుల రాజు, అతని భార్య భాగ్య, వారి బిడ్డలు నిహాన్ష్‌, శాన్వికగా గుర్తించారు. రాజు వయసు 35 వరకు ఉంటుందని, భాగ్య వయసు 25 ఏళ్లు ఉంటుంది. చిన్నారులు ఐదేళ్ల లోపు వాళ్లే. కంటిపాపల్లాంటి ఇద్దరు చిన్నారులతో కలిసి సంతోషంగా సాగాల్సిన ఆ కుటుంబ ప్రయాణం, అర్ధరాత్రి వేళ బావి రూపంలో పొంచి ఉన్న మృత్యుకుహరంలో ముగిసిపోయింది. 

బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా కబళించిన మృత్యువు 

పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం బల్వంతపూర్‌ గ్రామానికి చెందిన దండుగుల రాజు కుటుంబం బుధవారం నాడు సిద్ధిపేట వెళ్లింది. సిద్ధిపేటలో నివసించిన తమ అత్యంత సన్నిహిత బంధువు ఒకరు మరణించడంతో ఆ దంపతులు తమ ఇద్దరు చిన్నారులను తీసుకొని పరామర్శించడానికి, అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. పరామర్శ ముగించికొని, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తిరిగి తమ గ్రామానికి వస్తున్న టైంలో ప్రమాదం జరిగింది. 

Continues below advertisement

అర్ధరాత్రి సుమారు ఒంటి గంట దాటిన సమయంలో దుబ్బాక మండలం అప్పనపల్లి శివారుకు చేరుకోగానే కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. చీకటి దారి, స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడం, రోడ్డు పక్కన ఉన్న అడ్డంకులను సరిగ్గా గమనించకోపోవడం వల్ల డ్రైవింగ్ సీట్లో ఉన్న రాజు కారుపై నియంత్రణ కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. నియంత్రణ కోల్పోయిన కారు అంతే వేగంతో రహదారి పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడింది. 

మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ బంధువుల్లో ఆందోళన 

అర్ధరాత్రి రెండు గంటలు దాటినా రాజు కుటుంబం బల్వంతపూర్‌లోని తమ ఇంటికి చేరుకోకోపవడంతో బంధువల్లో ఆందోళన మొదలైంది. రాజు భాగ్యల మొబైల్‌ ఫోన్లకు వరుసగా ప్రయత్నించినప్పటికీ, రెండు ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అని సమాాానం రావడంతో వారి అనుమానం మరింత బలపడ్డాయి.

రాత్రి వేళల్లో ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం అర్ధరాత్రి నుంచి సిద్ధిపేట - దుబ్బాక ప్రధాన రహదారి వెంట గాలింపు చేపట్టారు. 

చీకటిలో గాలింపుతో బావిలో తేలిన కారు 

రంగంలోకి దిగిన దుబ్బాక పోలీసు బృందాలు అప్పనపల్లి పరిసర ప్రాంతాల్లో  క్షణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. గురువారం తెల్లవారుజామున అప్పనపల్లి గ్రామ శివారులోని రహదారి పక్కన ఉన్న బావి వద్దకు చేరుకున్న పోలీసులు రహదారిపై కారు టైర్ల గుర్తులు కనిపించాయి. ఆ దిశగా బావిలో చూడగా కారు మునిగిపోయి ఉన్నట్టు గుర్తించారు. 

సమాచారం అందుకున్న దుబ్బాక సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌, సబ్‌ఇన్స్పెక్టర్‌ తమ సిబ్బందితో అగ్నిమాపక దళ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. అయినప్పటికీ క్రేన్ జేసీబీ యంత్రాల సహాయంతో అత్యంత శ్రమతో కారు బావి వెలుపలికి తీశారు.  

ఒకే చోట నలుగురి మృతదేహాలు 

జేసీబీ సహాయంతో బురద, నీటితో నిండిన కారును బావి నుంచి బయటకు తీశారు. కారు తలుపులు తెరిచి చూడగా ఊపిరాడక కారులోనే మరణించిన రాజు, భాగ్యలతోపాటు వారి సీట్లలోనే అచేతనంగా పడి ఉన్న చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. పోలీసులు నాలుగు మృతదేహాలను వెలికితీసి, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

శోకసంద్రంలో బల్వంతపూర్‌

దుండగుల రాజుకుటుంబం అంతా ఒకే ప్రమాదంలో చనిపోయారనే వార్త బల్వంతపూర్‌ గ్రామానికి చేరగానే ఆ పల్లె మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది రాజు కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు స్థానికులను తీవ్రంగా కలిచి వేశాయి. కంటిముందు తిరుగుతూ సందడి చేసే నలుగురు  ఉన్నట్టుండి శవాలుగా మారడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదంపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా, లేదా రాత్రి పూట డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల ఈ ఘోరం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.