Ramagundam News: బూడిదే కదా అని తీసిపారేకండి.. ఆ బూడిద ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎన్టీపీసీ బూడిద చెరువు దందా మళ్ళీ మొదలైంది. గత కొద్ది రోజులుగా నిలిచిపోయిన బూడిద మాఫియా మళ్ళీ ఊపందుకుంది. తమకి ఎవరు అడ్డు లేదంటూ ఇష్టం వచ్చినట్టు బూడిద తరలిస్తున్నారు. కొన్ని లారీల్లో నేరుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇటుక బట్టీలకు రావాణా చేస్తుండగా మరికొన్ని లారీలను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకి రూ.15000 నుంచి రూ.30000 వరకు సంపాదిస్తున్నారు. సొంతంగా లోడింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో ఎవరికీ తెలియకుండా బూడిద దందా సాగిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి దాదాపు 200 నుంచి 300 లారీల బూడిదని అక్రమంగా రవాణా చేస్తున్నారు.


వీటితో పాటు సింగరేణి పేరుతో మరో 30 నుంచి 50 ట్రిప్పుల వరకు దారి మళ్లిస్తున్నారు. ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి బాటమ్ యాష్ ను సింగరేణి బొగ్గు గనుల్లో నింపేందుకు రవాణా చేయాలి. అధికారికంగా ఎన్టీపీసీ సింగరేణికి సరఫరా చేసేందుకు మాత్రమే అనుమతిచ్చింది. కానీ, దాని పేరుతో అక్రమంగా బూడిద లారీలు తరలిపోతున్నాయి. గుత్తేదారులు కొంత మంది వారికి సంబంధించిన లారీల్లో ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సుమారు 30 లక్షల బూడిద దందా సాగుతోంది. బూడిద అక్రమ రవాణాను స్థానిక లారీ యజమానులు పట్టుకున్నారు.


సింగరేణి పేరుతో కల్వచర్ల వద్ద నిర్వహిస్తున్న ఇటుక బట్టీకి తరలించిన బూడిద లారీని పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి పేరుతో కల్వచర్ల గ్రామానికి చెందిన ఇటుక బట్టికీ బూడిదను తరలించడంపై... లారీ యజమానులు బూడిద రవాణా చేసేందుకు వచ్చిన లారీని శుక్రవారం నిలిపివేశారు. బూడిద అక్రమంగా తరలిపోతున్న విషయంలో ఎన్టీపీసీ పర్యవేక్షణ లోపించింది అన్న ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీపీసీ బూడిద వ్యవహారం విజిలెన్స్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై విచారణ చేసినా మళ్లీ దందా సాగుతూనే ఉంది. బూడిద చెరువు వద్ద నిఘా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా బూడిద తరలిపోతుంది. నియంత్రణ లేకపోవడంతో గుత్తేదారులదే ఆధిపత్యం సాగుతోంది. ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి ఇతర జిల్లాలకు అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు చాలా మంది అక్రమార్కులు. 


ఎలాంటి బిల్లులు చెల్లించకుండా రాత్రి వేళల్లో లారీల్లో నింపుకుంటున్న అక్రమార్కులు నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ ప్రాంతాలతో పాటు, జిల్లాలోని సుల్తానాబాద్, రాఘవాపూర్, కల్వచర్ల ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు దూరం ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలోని ఇటుక బట్టీలకు రూ.15000 వరకు వసూలు చేస్తున్నారు. బయట ప్రాంతాలకు వెళ్తే కిలోమీటరు లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్కో లారీలో 30 నుంచి 36 టన్నుల వరకు బూడిద నింపుతారు. బుగ్గ గుట్ట సమీపంలోని ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి లారీలో నింపుకుంటున్న గుత్తే దారులు వాటిని రాజీవ్ రహదారి మీదుగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.