Bullet Bike turns into Mobile Barbeque: చదువు పూర్తి కాగానే యువత ఎదుర్కొనే ప్రశ్న.. జాబ్ వచ్చిందా. ఇంతకీ ఏం చేస్తున్నావు అని ఇంట్లో వారితో పాటు బంధువులు, స్నేహితులు అడుగుతుంటారు. అయితే కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే ఉపాధి అనేది పెద్ద విషయం కాదని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. టేస్టీ ఫుడ్ అంటే ఇష్టపడే నేటి తరానికి తగ్గట్టుగా తన బుల్లెట్ బండిని మాడిఫై చేయించి మొబైల్ నాన్ వెజ్ బార్బెక్యూ సెంటర్ లా మార్చేశాడు. టేస్టీ టేస్టీ చికెన్ స్నాక్స్ ని వేడివేడిగా అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నాడు. ఎవరా యువకుడు, ఏంటా స్టోరీ ఈ వివరాలపై ఓ లుక్కేయండి.
గ్యాస్ సిలిండర్ కాదు.. బొగ్గుల పొయ్యి
రామగుండంకు చెందిన మహమ్మద్ నిహాల్ స్వయంగా తనకంటూ ఒక  బిజినెస్ ఉండాలని అనుకున్నాడు. అయితే రకరకాల వ్యాపార అవకాశాలపై రీసెర్చ్ చేసిన అతను చివరగా చికెన్ స్నాక్స్ తయారు చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యాడు. అయితే అందరిలాగా కాకుండా కాస్త క్రియేటివిటీని జోడించి ఓ బుల్లెట్ బండిని మాడీపై చేయించాడు. బార్బీ క్యూ సెటప్ చేసేందుకు వీలుగా బైక్ కి ఇన్వర్టర్ బిగించి సూపర్బ్ గా కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేశాడు. ఇక చికెన్ ప్రిపరేషన్ కోసం గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండా మొత్తం కూడా బొగ్గుతోనే తయారు చేసేలా సెట్ అప్ రెడీ చేసుకున్నాడు. ఇక ఒరిజినల్ గా బొగ్గులపై కాలిస్తేనే కదా బార్బిక్యూ అసలు మజా ఉంటుంది.




ఐడియా వచ్చింది ఇలా...
మహమ్మద్ నిహాల్ నిజానికి రకరకాల బిజినెస్ అవకాశాలపై సెర్చ్ చేస్తుండగా వైజాగ్ కి చెందిన ఒక యువకుడు బుల్లెట్ బైక్ పైన చికెన్ స్నాక్స్ అమ్ముతున్న వీడియోను యూట్యూబ్లో చూశారు. ఆ స్నాక్స్ సెంటర్ అటు లుక్ తో పాటు టేస్ట్ కూడా బాగుండడంతో ఇక దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు. మొదటగా బడ్జెట్ ప్లాన్ చేసుకొని వైజాగ్ వెళ్లి మరీ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి తన నేటివ్ ప్లేస్ లో ఈ బుల్లెట్ బార్బెక్యూ చికెన్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు.
ఇలా ప్రిపేర్ చేస్తారు...
తన బిజినెస్ కి సంబంధించి చికెన్ ఐటమ్స్ ని మొత్తం ముందుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఉంచుతామని.. ఇక కస్టమర్ కోరిన విధంగా చేయడానికి చికెన్ ఐటమ్స్ ని రకరకాల ఫ్లేవర్స్ తో కలిపి సిద్ధంగా ఉంచుతామని తెలిపాడు నిహాల్. ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చి బొగ్గులపై తగినంత సమయం వరకు కాల్చడం ద్వారా క్రిస్పీగా.. టేస్టీగా ఉంటాయని తెలిపాడు. ఒకసారి ఇక్కడ తిన్న వాళ్ళు తిరిగి ఫ్యామిలీతో సహా వచ్చి ఆర్డర్ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు.


ఇక సాయంత్రం పూట రకరకాల రంగుల్లో వెలిగిపోయే లైటింగ్ తో కొత్త కస్టమర్లు సైతం అట్రాక్ట్ అవుతూ ఉంటారని అంటున్నాడు నిహాల్.. వెబ్‌సైట్‌లో తనకు వచ్చిన రేటింగ్ చూసి కూడా ప్రజల ఆదరణ ఏంటో చెప్పొచ్చని తెలిపాడు. అందుకే క్రియేటివిటీకి.. కష్టం తోడైతే ఈ రోజుల్లో సాధ్యం కానిది ఏదీ లేదని ఈ యువకుడి స్టోరీ మనకు తెలియజేస్తోంది.