మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ తండ్రి విషయంలో అతని ఏడేళ్ల కుమారుడు వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు సైతం ఆ బాలుడి చొరవకు ఫిదా అయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో జంగ దీపిక - బాల కిషన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు, మరో కూతురు ఉన్నారు. తండ్రి బాల కిషన్ మద్యానికి బానిస కాగా, రోజూ తాగి వచ్చి ఇంట్లో తల్లిని కొట్టడం, పిల్లల్ని ఇబ్బందులకు గురి చేయడం చేస్తున్నాడు. దీంతో ఇంట్లో భార్యా భర్తల మధ్య రోజూ గొడవ జరుగుతోంది. 


ముస్తాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాల కిషన్ రోజూ తాగి రావడం, భార్యను కొడుతుండడాన్ని వారి కుమారుడు తట్టులేకపోయాడు. ఇది చూడలేని మూడో తరగతి చదువుతున్న బాలుడు గురువారం పోలీసు స్టేషన్‌ కు వెళ్లి తండ్రి గురించి ఫిర్యాదు చేశాడు. ఇది పోలీసులను అమితమైన ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం ఉదయం బాగా తాగి వచ్చిన తండ్రిని మూడో క్లాసు చదువుతున్న కొడుకు చూశాడు. అదే సమయంలో తన తల్లిని కొట్టేందుకు సిద్ధమయ్యాడు.


దీంతో బాలుడు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు ఒక్కడే వెళ్లాడు. అక్కడ ఉన్న ఎస్సై వెంకటేశ్వర్లుకు మొత్తం విషయం చెప్పాడు. ఎస్సై ఆ బాలుడిని చూసి, స్టేషన్‌కు వెళ్లాలని ఎవరు చెప్పారని అడగగా, తానే వచ్చానని సమాధానం చెప్పాడు. ఇక్కడ నీకు పోలీసులు న్యాయం చేస్తారని, సమస్య పరిష్కరిస్తారని నమ్మకం ఉందా? అని బాలుడిని సరదాగా అడిగారు. దానికి బాలుడు సమాధానం చెప్తూ.. తప్పకుండా చేస్తారనే నమ్మకంతో వచ్చాను సార్‌ అని చెప్పాడు. దీంతో ముచ్చట పడ్డ ఎస్సై బాలుడిని హత్తుకున్నారు. ఆ వయసులో ఇలా ఆలోచించగలిగిన బాలుడిని ఎస్సై అభినందించారు. బాలుడు చెప్పిన వివరాల ప్రకారం.. వెంటనే బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. తండ్రి బాల కిషన్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇంకోసారి తాగినా, అల్లరి చేసినా, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయినా  చర్యలు తీవ్రంగా ఉంటాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపారు.


వారం క్రితం రైతు మరణం


మరోవైపు, ఇదే జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో రైతు చిగుర్ల రాజమల్లయ్య (62) దుర్మరణం పాలయ్యాడు పశువుల కాపరి అయిన ఈయన స్థానికంగా చెక్ డ్యామ్ లోకి వెళ్లడంతో లోతు అంచనా వేయలేకపోయిన రాజమల్లయ్య నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాజమల్లయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు కూతుర్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. మంగళవారం పశువులను మేపేందుకు తమ పొలం వద్దకు వెళ్ళాడు. రాత్రి అయినప్పటికీ రాజమల్లయ్య ఇంటికి రాకపోవడంతో భార్య బుచ్చవ్వ ఆందోళనకు గురై.. చుట్టుపక్కల వెతికింది. అస్సలు ఆచూకీ లభించకపోవడంతో కుమారులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన కుమారులకు తమ పొలం పక్కన ఉన్న చెక్ డ్యామ్‌లో శవమై రాజమల్లయ్య కనిపించాడు.