Ramagundam Solar Plant: రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటి పై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్రాజెక్టు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. ఈ ప్రాజెక్టును నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. ఎన్టీపీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. దాదాపు  423 కోట్లతో రెండేళ్ల పాటు, ఐదు వందల ఎకరాల విస్తీర్ణం గల నీటిపై సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణం చేపట్టారు. 40 బ్లాక్ లో నిర్మించిన ఈ ప్రాజెక్టులో బ్లాక్ లో 2.5 మెగావాట్ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.


హై డెన్సిటీ పాలిథిలిన్ తో తయారు చేసిన ఫ్లోటర్ల పైన సోలార్ ప్లేట్లను అమర్చి ఈ అద్భుతాన్ని సృష్టించారు. రోజుకు ఐదు లక్షల యూనిట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ నుండి.. రెండు లక్షల యూనిట్లను గోవా రాష్ట్రానికి అందిస్తుండగా మిగతా మూడు లక్షల యూనిట్లను మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య కార్యక్రమంలో భాగంగా జాతికి అంకితం చేయనున్నారు.
అయితే జులై 1న పూర్తి స్థాయి విద్యుత్తు ఉత్పత్తి దశలోకి ఈ ప్రాజెక్టును తీసుకు వచ్చారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాక్ లో 2.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ఈ కార్యక్రమంలోనే మరో మూడు కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని భూమి పూజను వర్చువల్ పద్ధతిలో చేయనున్నారు. 


ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తి వివరాలు..


రామగుండం ఎన్టీపీసీ జలాశయం సామర్థ్యం మొత్తం నాలుగు వేల ఎకరాలు. దాదాపు వెయ్యి ఎకరాల్లో నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో నిల్వ ఉన్న నీరును దృష్టిలో పెట్టుకొని.. 400 ఎకరాల విస్తీర్ణంలో సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రణాళికలు రచించారు. క్రిస్టలిక్ సిలికాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటో వోల్టాయిక్ ప్యానళ్లు ఉపయోగించి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. సౌర ఫలకాలు, ఇన్వర్టర్ గదులు, ట్రాన్స్ ఫార్మలు, హెచ్ టీ బ్రేకర్లూ నీటిపై తేలియాడేలా పనులు చేపట్టారు. 


100 మెగావాట్ల విద్యుత్ బ్లాకులో 40 బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బ్లాకులో కనీసంగా 11, 200 సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టక ముందే డ్రైడాక్ స్టింగులు ఏర్పాటు చేయడం విశేషం. రామగుండంలోని ఎన్టీపీసీ యాజమాన్యం రానున్న ఐదేళ్ల కాలంలో... 50 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ సౌర విద్యుత్ కేంద్రానికి ఎలాంటి భూసేకరణ సమస్య ఉండదు. నీరు కూడా ఆవిరయ్యే అవకాశాలు తక్కువ. నీటి ఫలకాల ఏర్పాటుతో జలాశయం మరింత శోభయమానంగా ఉంది. ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణ రహిత ప్రాజెక్టులే లక్ష్యంగా పని చేస్తుంది.