Grand Father Murder: అక్రమంగా ఆస్తిని పొందడానికి సొంత తాత, అమ్మమ్మ లపై దాడి చేసి చివరికి వృద్దుల మృతికి కారణమైన ఇద్దరు దుర్మార్గులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సుల్తానా బాద్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. సుల్తానాబాద్ గడిమహల్ కి చెందిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయి లింగయ్య(76) రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో పెద్దపల్లి సమీపంలోని పెద్ద బొంకూర్ వద్ద రెండు ఎకరాల 18 గుంటల స్థలాన్ని కొన్నాడు. లింగయ్య- ఒదెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు... రాజమ్మ, వరలక్ష్మి ఉండగా వారిద్దరికీ చెరో ఎకరం రాసిచ్చాడు. 


లోను వస్తుందంటూ సంతకాలు పెట్టించుకొని.. భూమి లాక్కున్నారు!


తరువాత 18 గుంటలలో పది గుంటల భూమిని రాజమ్మ కూతురు అనిత పేరు మీద మిగిలిన ఎనిమిది గుంటల తన పేరుని పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజమ్మ కొడుకులు సంతోష్, రవి ఆ ఆస్తి మొత్తం తమకే దక్కాలని కుట్ర పన్నారు. పది నెలల కిందట తాము బ్యాంకు లోన్ తీసుకుంటున్నామని దాని కోసం సాక్షిగా తాత లింగయ్య సంతకం పెడితే రుణం మంజూరు అవుతుందని అన్నారు. దీంతో వారి మాటలు నమ్మి లింగయ్య సంతకాలు పెట్టాడు .ఆ బాండ్ పేపర్ పై లింగయ్య తన మొత్తం భూమిని 14 లక్షల 70 వేల రూపాయలకు అమ్మి నట్టుగా  ఇద్దరు కలిసి డాక్యుమెంట్ సొంతంగా క్రియేట్ చేశారు. ఇక అప్పటి నుండి తాతకి, అమ్మమ్మకి బెదిరింపులు మొదలయ్యాయి. 


పిన్నిని పొలం వైపు కూడా రానివ్వకుండా బెదిరింపులు..!


భూమి మొత్తం తమదేనని చిన్నమ్మ వరలక్ష్మి, చెల్లెలు అనిత కూడా ఆ పొలం వైపు రాకుండా వారిని బెదిరిస్తూ పలుమార్లు దాడి చేశారు. దీంతో ఈ విషయం కుల పెద్దల సమక్షంలో పంచాయతీల వరకు వెళ్ళింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సంతోష్, రవి ఇద్దరిపై పెద్దపల్లి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. 15 రోజుల కిందట వరలక్ష్మి తన భూమిలో పొలం వేయగా తిరిగి దాన్ని చెడగొట్టారు. ఈసారి పంట వేస్తే ఏకంగా చంపేస్తామని బెదిరించారు. ఇక ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని దీనికి చివరి పరిష్కారంగా తాతని, అమ్మమ్మని చంపేస్తే తమకు అడ్డు ఉండదని క్రూరమైన ఆలోచన చేశారు ఇద్దరు క్రిమినల్ మనవళ్ళు. 


తాత, అమ్మమ్మలపై మనవళ్ల దాడి...!


దీంతో ఈ నెల 27 వ తారీఖున సుల్తానాబాద్ లోని లింగయ్య ఇంటికి వచ్చి తాత అమ్మమ్మలతో తీవ్రంగా గొడవ పడ్డారు. అనంతరం కర్రతో వారిద్దరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిద్దరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ట్రీట్మెంట్ తీసుకుంటూ తాత లింగయ్య చనిపోయాడు. ఇక అమ్మమ్మ ఓదెమ్మ ఇప్పటికీ చికిత్స పొందుతోంది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు నిందితులు ఇద్దరూ తేలికగానే చిక్కారు. వారి దగ్గర నుండి ఒక ద్విచక్ర వాహనం, దాడికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. 


కలికాలంలో బంధాలు అనుబంధాలకు చోటు లేదని... ఆస్తిలో మెజారిటీ వాటా ఇచ్చినప్పటికీ సొంత మనవల్ల చేతిలోనే మోసపోయి, హత్య గావించబడ్డ లింగయ్య సంఘటన అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఇంద్రసేనా రెడ్డి, ఎస్సై ఉపేంద్ర రావు, అశోక్ రెడ్డి,  ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్స్ గణేష్, మల్లేశం, నవీన్, తిరుపతిలను ఏసీపీ సారంగపాణి అభినందించారు.