కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చాలా రోజు తర్వాత యాక్టివ్ అయ్యారు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఈ లీడర్ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ప్రజాబాట పేరుతో నేటి నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర సుమారు పది రోజుల పాటు సాగనుంది.
కరీంనగర్‌లో పట్టుబగించేందుకు పొన్నం ప్రభాకర్ ప్లాన్ చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాబాట పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. తన సహజ శైలి రాజకీయ ధోరణిలో ఎన్నికల్లో తలపడాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పాదయాత్ర చేయనున్నారు.
రాములవారి దీవెనలతో..
ప్రజాబాట పేరుతో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్న సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్.. ముందుగా రాములవారిని దర్శించుకున్నారు. ఇల్లంతకుంట శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ఇన్ ఛార్జి బల్మూర్ వెంకట్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామారావు, కనుమల రామకృష్ణతో కలిసి రాముల వారి దీవెనలు తీసుకున్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ పై మాటల తూటాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పూర్తిగా అబద్ధాలతో ప్రజలను వంచిస్తున్నదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. స్వాతంత్రానికి ముందు నుంచే కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు పోరాడుతున్నారని అన్నారు. ప్రాణాలు సైతం త్యాగం చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ నాయకులకే ఉందని తెలిపారు. అయితే కేవలం బీజేపీ మాత్రమే దేశాన్ని కాపాడిందనే తరహాలో గతాన్ని విస్మరించి మరీ కొత్త తరానికి అబద్ధాలను చెబుతున్నారని పొన్నం విమర్శలు చేశారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందని... ధరలు కూడా విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి బండి సంజయ్ కొత్తగా చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని.. మాటల్లో ఉన్న దూకుడు చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎప్పుడో కోల్పోయారని అన్నారు.
మళ్లీ ఎంపీగా పోటీ కి సిద్దమవుతున్నారా???
గతంలో 2009లో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎంపికైన తర్వాత పొన్నం ప్రభాకర్ త్వరగానే కీలక పదవులు చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీలకు ప్రతినిధిగా ఢిల్లీలో వ్యవహారాలను నడిపారు. నియోజకవర్గంలో మంచి పట్టున్న పొన్నం.. మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు.
పక్కా ప్లాన్ తో తిరిగి ప్రజాక్షేత్రంలోకి..
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలు, 14 మండలాలు, 70 గ్రామాల మీదుగా పొన్నం ప్రజాబాట పాదయాత్ర సాగనుంది. దాదాపుగా 150 కిలోమీటర్ల మేర పొన్నం పాదయాత్ర చేయనున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా దూకుడుగా వ్యవహరించే వారు. సై అంటే సై అన్నట్లుగా ఉండేది పొన్నం ధోరణి. ఈ మధ్య కాలంలో ఎందుకోగానీ కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. రాజకీయ కార్యక్రమాల్లో చాలా తక్కువగా కనిపించారు. ఇతర పార్టీల నాయకుల విమర్శలకు కూడా పెద్దగా స్పందించలేదు. అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా? అనే అనుమానం వచ్చేలా సైలెంట్ గా ఉన్నారు. మాస్ లీడర్‌గా పేరొందిన పొన్నం ప్రభాకర్.. ఇలా రాజకీయాలకు అంటీ ముట్టనట్లుగా ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఆయన అనుచరులు, అభిమానులు, నియోజకవర్గ నాయకులు పొన్నం సైలెన్స్ తో అయోమయంలో పడి పోయారు. ఇతర పార్టీల నేతలు సైతం పొన్నం ఉన్నట్టుండి రాజకీయాలకు దూరంగా జరగడం ఏంటని చర్చించుకున్నారు. ఇప్పుడు తిరిగి ప్రజా క్షేత్రంలో తన శైలిలో దూసుకుపోయేందుకు పక్కా ప్లాన్ తో వచ్చారు. హస్తం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు, నియోజకవర్లంలో పట్టు బిగించేందుకు వివిధ కార్యక్రమాలకు ప్రణాళిక రచించారని సన్నిహితులు చెబుతున్నారు.