Peddapalli Latest News: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ శ్రీహర్షపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్ పోర్ట్ వివరాలు అడిగితే లేవు అనే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం,సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం మెసేజ్‌లు చేసిన రిప్లై ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు.
కార్యక్రమం ప్రారంభోత్సవం వేళ ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రధాన మంత్రి మాతృవందన పథకం కింద ప్రసూతి ప్రయోజనాలను మహిళలకు వివరించారు. మహిళలు ఈ కార్యక్రమన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు,ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉందని ఎంపీని కోరారు. దీంతో తప్పకుండా ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత పక్కనే కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.బిల్డింగ్ పనులు ఎలా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే ప్రజా సమస్యలపై సమాచారం అందిస్తే ఎందుకు స్పందించడం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ఎంపీ ప్రశ్నించారు. రామగుండం ఎయిర్ పోర్ట్,ESI ఆస్పత్రి వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ హోదాలోనే వివరాలు అడిగితే ఇవ్వలేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల ద్వారా ప్రజల కోసం ఎన్నికైన తాను ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాసేవ చేసేందుకే ఎంపీగా ఉన్నానని కలెక్టర్ పై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలనేది రిక్వెస్ట్ కాదని కలెక్టర్ గా మీ బాధ్యత అని గుర్తుకు చేశారు. ఎవరైనా ఎంపీ చెప్పిన పనులకు చేయొద్దని నిబంధనలు ఏమైనా పెట్టారా అని కలెక్టర్ ను ప్రశ్నించారు. దీంతో కలెక్టర్ కోయ శ్రీహర్ష కి ఏమి సమాధానం ఇవ్వాలో నోటి నుంచి మాట రాలేదు. వెంటనే అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు.