కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ సంస్థలు ఉన్నట్లుగానే భవిష్యత్తులో మద్యం డెలివరీ సంస్థలు కూడా ఏర్పడతాయని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో మద్యం ఇంటికి డెలివరీ అయ్యేలాగా వ్యవస్థ ఏర్పడుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించబోయే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని, ఆ బ్రాండ్ కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇప్పటికే ప్రభుత్వానికి ఆదాయం తేవడానికి ఊరికో బెల్టు షాప్ పెట్టారని అన్నారు. ఎక్సైజ్ పోలీసులకు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. సమాజాన్ని మద్యానికి బానిసలు చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య ఆలోచనా విధానామని జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పేదవారి నుంచి రూ.లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటుందని, మద్యం తాగే వాళ్ళ పొట్ట కొడుతుందని మండిపడ్డారు. మద్యంతో సమాజాన్ని బానిసలు చెయ్యొద్దని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో పోటీపై ఇటీవలే కీలక వ్యాఖ్యలు
మరో నాలుగు నెలల్లో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ప్రత్యామ్నాయం ఎవరూ లేరు కాబట్టి, ఆ బాధ్యత తనపై పడే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలంటే ధైర్యం కావాలని, గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అంశం ఇంకా ఖరారు కాలేదని అన్నారు. హైకమాండ్ మాత్రం ఆ బాధ్యత తనపై పెడుతుందని జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నందునే, పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని అన్నారు.
40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జగిత్యాల ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. తాను ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఇంతకాలం ప్రజల మధ్యనే ఉన్నానని అన్నారు. ఇకముందు కూడా అలాగే ఉంటానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.