MLC Jeevan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం కలవాలని మాట్లాడటం వైసీపీ పాలన వైఫల్యమే అన్నారు. విభజన చట్టంలో హామీలను, ప్రత్యేక హోదాను ఎందుకు సాధించుకోలేక పోయారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం జగన్ హామీలపై ఎందుకు అడగలేకపోయారని...రెండు రాష్ట్రాల్లో విష బీజాలు నాటేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.
"సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఏర్పడుతుందట. ఎక్కడ సమైక్య రాష్ట్రం అని చెప్పి అడుగుతున్నం. సీమాంధ్రలో నువ్వు ఆశించిన ఫలాలు పొందలేకపోవడం నీ వైఫల్యం. రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో.. వాళ్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడగలేకపోతున్నరు. మీ హక్కులు మీరు పొందలేకపోవడం మీ వైఫల్యమే. మరి మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నరో మీకే తెలియాలి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ లు తల్లిదండ్రుల బంధంగా పేర్కొంటున్నరు.. ఇదేనా వాళ్ల బంధం అని నేను ప్రశ్నిస్తున్న." - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఇటీవలే ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత ఎంపీగా గెలిస్తే తమపై పెత్తనం చెలాయిస్తుందని భావించి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి నిజామాబాద్‌లో ఆమె కనబడకుండా చేయాలని, కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచి ఆమెను లోక్ సభ ఎన్నికల్లో ఓడగొట్టారని జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత ఓడిపోవడంతో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ స్వతంత్రం వస్తుందని వారు భావించారని, అందుకే ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కవితపై కుట్ర చేశారు !
రాజకీయాల్లో ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి, నేతల్ని ఓడించేందుకు అవతలి పార్టీలు వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ లో గత లోక్ సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయారు. అయితే ఇందుకు ప్రతిపక్ష పార్టీలు కారణం కాదని, టీఆర్ఎస్ పార్టీలోనే కుట్రలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కవిత ఎంపీగా గెలిస్తే తమకు నిజామాబాద్ లో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండదని టీఆర్ఎస్ నేతలు భావించారని జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కింద వచ్చే ఏడుగురు ఎమ్మెల్యేలు నెగ్గినా, కవిత ఓటమి కోసం పని చేశారని కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.