Minister KTR Drives A Boat: కోనసీమను తలదన్నే విధంగా సిరిసిల్ల అభివృద్ధి చెందిందని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. రూ.3.16 కోట్లతో మిడ్‌మానేరు జలాశయంలో విహారానికి ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బోటును నడిపి సందడి చేశారు.
అలాగే బైపాస్ రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్‌ను సైతం ప్రారంభించారు. ఏరియా దవాఖానాలో 40కేవీ రూప్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను, 130 అదనపు బెడ్స్, క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరఫీ డేకేర్ సెంటర్‌కు ప్రారంభోత్సవం చేశారు. పద్మనాయక కల్యాణమండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో, మతానికి సంబంధించిన వారు కాదని.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మ గౌరవ పోరాటమని అన్నారు. పాపన్నగౌడ్ పది మందితో పోరాటాన్ని ప్రారంభించి.. గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారన్నారు. గతంలో సిరిసిల్లకు వస్తే చుక్కనీరు కనిపించేది కాదని, నేడు పాపికొండలు, కోనసీమను తలదన్నే విధంగా సిరిసిల్ల అభివృద్ధి చెందిందన్నారు.
మిడ్‌మానేరులో మత్స్య సంపదను పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టాటాలు, బిర్లాలే కాదు.. తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశం అన్నారు. గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. గౌడ కుల సంఘ భవనానికి రెండెకరాల స్థలం, భవన నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏ గ్రామంలో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటే ఈత, తాటి వనాలను పెంచేందుకు కేటాయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నామన్నారు. సిరిసిల్ల గౌడన్నలకు తెలంగాణలో మొదటిసారిగా సేఫ్టీ మోకులు అందజేస్తామన్నారు. సిరిసిల్లతో పాటు జిల్లాలోని మండల కేంద్రాల్లోనూ నీరా కేఫ్‌లు ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్‌ను కోరుతున్నట్లు చెప్పారు.
మల్కపేట జలాశయాన్ని వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. మల్కపేట జలాశయం నుంచి సింగసముద్రం, బట్టల చెరువు మీదుగా నర్మాల డ్యామ్‌ను నింపుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే నర్మాల డ్యామ్‌ను మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా నింపుతున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మానేరులో 365 రోజులు నీరు పారుతుందన్నారు. కరెంటు, సాగునీటి, తాగునీటి కష్టాలను శాశ్వత పరిష్కారం చూపామన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో నేతన్నలు, గౌడ వృత్తిదారులు ఎంతో మంది చనిపోయినా పట్టించుకోలేదన్నారు. గౌడన్నలు ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారని, తెలంగాణ వచ్చాక అలాంటివి లేవన్నారు. గౌడన్నల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, మరిన్ని ఉపాధి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సేఫ్టీ మోకుల తయారీ, పరీక్షల అనంతరం వాటిని గీతన్నలకు పంపిణీ చేస్తామని చెప్పారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial