Harish Rao On BJP: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర మొదలు పెడితే... బీజేపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. రామగుండం గల్లీలో ప్రధానిది ఒక మాట, ఢిల్లీలో ఒక మాట అంటూ పెద్దపల్లి జిల్లా నందిమేడారం సభలో విమర్శించారు. గురువారం రోజు ఆయన నందిమేడారంలో 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం సభా వేదికలో మాట్లాడుతూ.. సింగరేణిని ఎలా ప్రైవేటుపరం చేస్తారని ప్రశ్నించారు. రైతులను చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. రైతులు చనిపోతే.. తిన్నది అరగక చనిపోయారు అని నాడు కాంగ్రెస్ నాయకులు అనలేదా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఉన్నది తల్లి ప్రేమ అని, బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఉన్నది సవతి తల్లి ప్రేమ అని చెప్పుకొచ్చారు. రైతుల కోసం కల్లాలు కడితే.. అది తప్పు, 150 కోట్లు తిరిగి ఇవ్వాలని బీజేపీ అంటోందని పేర్కొన్నారు. గొంతులో ప్రాణం ఉండగా బోరు బావి కాడ మీటర్ పెట్టనని, రైతుల కడుపు కొట్టనని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. దట్ ఈజ్ కేసీఆర్.. అంటూ ప్రశంసల వెల్లువ కురిపించారు.
అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని బీజేపీ లీడర్లపై మండిపడ్డారు హరీష్‌రావు. ప్రధానమంత్రి వచ్చి రామగుండంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. గుజరాత్ కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అని అన్నారు. సింగరేణిని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వివరించారు. నాలుగు గనులు ఎలా ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాలన్నారు. పనులు చేసేది ఎవరు, పన్నులు వేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు.
రాష్ట్ర ప్రజల కోసం ఎంతగానో ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ సరికొత్త పథకాలు తీసుకొస్తున్నారని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఇందులో భాగంగానే గర్భిణీలకు న్యూట్రీషన్ కిట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్, బాలింతగా మారినప్పుడు కేసీఆర్ కిట్ అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ కిట్ విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడంతో ఇదే స్ఫూర్తితో మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తీసుకురాబోతున్నారని తెలిపారు హరీష్ రావు. అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్ ప్రవేశ పెడుతున్నామన్నారు. మొత్తం 1.24 లక్షల మంది గర్భిణీలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యమన్నారు హరీశ్ రావు.