కరీంనగర్ జిల్లా ఆసిఫ్‌ నగర్‌లో జరిగిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. అక్కడే ఆయనకు ప్రమాదం తప్పింది. చెరువుల పండుగలో భాగంగా ఆయన నాటు పడవలో ప్రయాణించారు. అది కాస్త నీటిలో మునగడంతో ప్రమాదం జరిగింది.


 పడవ నీటిలో మునగడంతో మంత్రి గంగుల నీట మునిగిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ని పైకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో అక్కడ ఉన్న వారంతా షాక్ తిన్నారు. మంత్రి కూడా కాసేపు షాక్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకొని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అప్పటి వరకు సరదాగా సాగిన కార్యక్రమంలో ఒక్కసారిగా జరిగిన చిన్న అపశృతితో గందరగోళం నెలకొంది. అక్కడ వారికి ధైర్యం చెప్పి మంది కార్యక్రమం జోష్‌తో ముగిసేలా చేశారు. 


సంబురంగా తెలంగాణ దశాబ్ధి వేడుకలు 


తెలంగాణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా కరీంనగర్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పండుగను నిర్వహించారు. నాడు ఎండిన చెరువులు ఎండితే నేడు నిండుగా ఉన్నాయంటూ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు జల్లు కురిపించారు.  సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ కాకతీయతో కరవు మాట లేదన్నారు. వెసవిలో కూడా చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు. 


సంబరాల్లో భాగంగా ప్రతి పల్లెల చెరువుల వద్ద పండగ వాతావరణం కనిపించింది. అక్కడే ప్రజాప్రతినిధులు భోజనావలు చేశారు. సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సాధించిన ప్రగతిని లీడర్లు వివరించారు. బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిర్మల్‌లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ధర్మపురి దమ్మన్నపేటలో కొప్పుల ఈశ్వర్‌, కరీంనగర్‌ జిల్లాలోని చామన్‌పల్లిలో గంగుల కమలాకర్‌, నిజామాబాద్‌ జిల్లా పురాణిపేటలో వేముల ప్రశాంత్‌రెడ్డి, సిద్దిపేట కోమటిచెరువు వద్ద మంత్రి హరీశ్‌రావు, సూర్యాపేట పిల్లలమర్రి చెరువు వద్ద జగదీశ్‌రెడ్డి, ఖమ్మం లకారం చెరువువద్ద మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 


 


ఈ పథకాలు కావాలంటే కేసీరే రావాలి: హరీష్


కొనసీమన తలదన్నే తెలంగాణను తయారు చేసిన కేసీఆర్‌ను వదులుకుంటే అసలుకే మోసం వస్తుందన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట గ్రామంలో జరిగిన చెరువుల వేడుకలో ఆయన పాల్గొన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని ప్రపంచమే మెచ్చిందని గుర్తు చేశారు. దీనికే మార్పులు చేర్పులు చేసి అమృత్‌ సరోవర్ పేరుతో కేంద్రం అమలు చేస్తోందని తెలిపారు. అలాంటి పథకాలు కావాలంటే కేసీఆర్‌ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 


 


తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం : కేటీఆర్


అమృత్‌ సరోవర్‌ రూపంలో తెలంగాణ మోడల్‌ దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైందన్నారు మంత్రి కేటీఆర్. చుక్క నీరు లేక శల్యమైన చెరువులకు ప్రాణం పోసిన నాయకుడు కేసీఆర్ అంటూ ఓ కవితను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పదేళ్ల క్రితం ఎక్కడ చూసిన చెరువుల ఎండిపోయి గుండె బరువెక్కేదన్నారు. ఇప్పుడు వాటిని కల్పతరువుగా మార్చేసి కరువును దూరం చేశారన్నారు. 


 


చెరువులు బాగుంటే గ్రామాలకు మహర్దశ: కవిత


చెరువులు బాగుంటేనే పల్లెలు బాగుంటాయన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు. ఆ పల్లెలు బాగుంటాలంటే, చెరువులు బాగుండాలంటే కేసీఆర్ రావాలన్నారు. 47 వేల చెరువులను రూ.5 వేల కోట్లతో మరమ్మతు చేయించారని గుర్తు చేశారు. అందుకే మండుటెండల్లో కూడా చెరువులు కళకళలాడుతున్నాయని తెలిపారు.