Minister Gangula Kamalakar: కుంభకోణాలకు పెట్టింది పేరే కాంగ్రెస్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఒకరికి పోటీగా ఒకరు పాదయాత్రలు చేస్తున్నారని, భట్టి పాదయాత్ర కన్నా తన పాదయాత్ర హైలెట్ కావడానికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసంబద్ద ఆరోపణలు చేస్తున్నారని గంగుల కమలాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి, సంజయ్ వారి మాటలతో ప్రజల్లో భయాందోళనలు కలిగించి వారి భవిష్యత్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదని మంత్రి గంగుల ఎద్దేవా చేశారు.


బీజేపీ రాష్ట్రాల్లో లీకులు, ఉద్యోగ అమ్మకాలు సాధారణం


2017లో యూపీఎస్సీ ఎగ్జామ్ కేసులో జాయ్సీ జాయ్ అనే ఆమెను హైదరాబాద్ లోనే అరెస్ట్ చేశారని మంత్రి గంగుల గుర్తు చేశారు. మరి అప్పుడు ప్రధాని మోదీ ఎందుకు బాధ్యత తీసుకోలేదని గంగుల ప్రశ్నించారు. గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకులు, ఉద్యోగాలు అమ్ముకోవడం సర్వసాదరణంగా మారిపోయిందని గంగుల కమలాకర్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కోకొల్లలుగా పేపర్ లీకేజీలు, ఉద్యోగాల అమ్మకాలు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. 


స్కాంలకు పెట్టింది పేరే కాంగ్రెస్


కుంభకోణాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. స్కాంల ప్రభుత్వం నడిపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డే షర్మిల అని మంత్రి గంగుల విమర్శించారు. రోశయ్య హయాంలో ఏపీపీఎస్సీ సభ్యుడిని అరెస్ట్ చేస్తే నాటి మంత్రులు రాజీనామా చేసింది గుర్తు లేదా అని గంగుల ప్రశ్నించారు. బొంబాయి, బీవండి వలసల్ని మల్లా తేవడానికా కాంగ్రెస్ ప్రయత్నాలు అని మంత్రి ఆరోపణలు చేశారు. 


37 వేల ఉద్యోగాల్లో చిన్న ఆరోపణ కూడా లేదు


కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 37 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ జరగ్గా.. ఒక్క చిన్న ఆరోపణ కూడా రాలేదని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే తక్షణమే అరెస్ట్ చేశామని మంత్రి అన్నారు. ఇద్దరు వ్యక్తుల తప్పుకు కేటీఆర్ గారి పేషీకి ఏం సంబంధమని గంగుల ప్రశ్నించారు. తిరుపతి బీసీ బిడ్డ అని అతన్ని కావాలనే రేవంత్ రెడ్డి లాగుతున్నారని గంగుల ఆరోపించారు. బీసీలను అణచడమే రేవంత్ రెడ్డి నైజమని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలకు లీకేజీపై సోయే లేదు వారికి విషయం తెలియనే లేదని గంగుల తెలిపారు. ఈ నెల 12వ తేదీన విషయం తెలియగానే నిందితులను అరెస్ట్ చేశామని గంగుల కమలాకర్ వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పారదర్శకంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిట్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం, వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడంపై ఉన్న ఇంట్రెస్ట్ నిందితులను శిక్షించమని కోరే విషయంలో లేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా విపక్షాలు తీరు మార్చుకొని ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడితే మంచిదని సూచించారు. ప్రభుత్వం కచ్చితంగా నిందితులను శిక్షిస్తుందని వివరించారు. దీనిపై ప్రతిపక్షాలు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు.