Stray Dogs Attack: వీధికుక్కల స్వైర విహారం రోజురోజుకూ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో ఇటీవల ఓ బాలుడిపై కుక్కలు దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు బయటకు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కొక్కరూ గాయపడ్డారు. తాజాగా మెదక్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి.. వెంటనే బాలికను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందుకుంటోంది. 


ఇటీవలే సిద్ధిపేటలో డిప్యూటీ కలెక్టర్ పై దాడి..


సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్ లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. నగర శివారులో సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ జిల్లా పాలనాధికారితో పాటు అధికారులు కూడా నివాసాలు ఏర్పరుచుకున్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ నివాసాల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి తన క్వార్టర్ ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్నారు. క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఎక్కడి నుంచో ఓ వీధి కుక్క వచ్చి గట్టిగా కరిచింది. శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ కుక్క వదల్లేదు. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ రెండు కాళ్లను కొరికేసింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది చేరుకొని కుక్కను తరిమారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ కు ఎలాంటి హానీ జరగలేదు. కానీ రెండు కాళ్లు పిక్కల మధ్య కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. విపరీతమైన రక్త స్రావం కూడా అయింది. ఈ క్రమంలోనే సిబ్బంది హుటాహుటిన డిప్యూటీ కలెక్టర్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


చికిత్స చేసిన వైద్యులు డిప్యూటీ కలెక్టర్ ను ఇంటికి పంపారు. సమీపంలో ఉన్న ఓ బాలుడిని, డిప్యూటీ కలెక్టర్ పెంపుడు కుక్కపై కూడా వీధికుక్క దాడి చేసిందట. దీంతో క్వార్టర్స్ లో ఉన్న అధికారులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో అంతా షాకవుతున్నారు. 


నెల రోజుల క్రితం నిజామాబాద్ లో..


నిజామాబాద్ జిల్లాలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మెండోరా మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ గంట వ్యవధిలో 12 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఇద్దరికి కాళ్లకు, మరో నలుగురికి చేతికి, ఇద్దరికి ఛాతీపై, మరో ఇద్దరికి ఏకంగా ముఖం పై దాడి చేసి గాయపరిచాయి. మెండోరా మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఉండటంతో వారిని అక్కడికి తరలించారు.  డాక్టర్ కుక్కల కాటు గురైన వారిని పరిశీలించారు. 8 మందికి తీవ్రంగా గాయలయ్యాయని, మరో నలుగురికి స్వల్పంగా గాయలయ్యాని తెలిపారు. ఇద్దరికి సర్జరీ అవసరం ఉండొచ్చని డాక్టర్ తెలిపారు. మండల కేంద్రంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.