దళిత, గిరిజన, ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అమాయక నక్సలైట్లు అడవుల్లో ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు ఈ అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని, ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. 

Continues below advertisement

అర్బన్ నక్సల్స్‌కు వారి గుండెకోత తెలియదా.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్ విచ్చేసిన సందర్భంగా నక్సలిజం, అర్బన్ నక్సలైట్లపై తీవ్రంగా స్పందించారు. మావోయిజంపై బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తూ, అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీ వ్యతిరేకమని, తుపాకీ ద్వారా రాజ్యాధికారం అసాధ్యం. ప్రజలు దాన్ని హర్షించబోరని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని, నేడు అదే నిజమైందని అన్నారు. మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారని, అమాయక పిల్లలను రెచ్చగొట్టి వారి ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు ఈ అర్బన్ నక్సల్స్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్‌కు తెలియదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నక్సలైట్ల మృతికి అర్బన్ నక్సల్స్ బాధ్యత వహించాలితాను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావుకు మీరే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పౌర హక్కుల సంఘం నాయకులతో సహా ఈ అర్బన్ నక్సల్స్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనేది మీ సిద్ధాంతం అయినప్పుడు, అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎలా భాగస్వాములయ్యారని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామన్న హామీ, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ హామీ, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలు ఇచ్చారా అని నిలదీశారు. అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భారతదేశాన్ని ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేర్చిందని, విదేశాధి నేతలే మోదీకి సాష్టాంగ పడుతుంటే ఈ అర్బన్ నక్సల్స్‌కు కన్పించదా అని ప్రశ్నించారు. అడవుల్లోని అన్నలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారని, వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. 

2026 మార్చి నాటికి మావోయిస్టులు అంతం..కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సాయం అందిస్తామని, వారు సంతోషంగా జీవించవచ్చని హామీ ఇచ్చారు. నక్సలిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్లు కూడా నేరస్తులేనని, మావోయిస్టులే తుపాకులు వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తుంటే, అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా, అది సమర్థనీయమా అని ప్రశ్నించి, వారి విజ్ఞతకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.