Bhu Bharati Portal Registration Scam: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై లోకాయుక్త సీరియస్‌గా స్పందించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి, సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ (CCLA), స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీ-సేవా కమిషనర్, జనగామ జిల్లా రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.
ఎలా మోసం చేస్తారంటే..
ఈ అక్రమాల తీరు పరిశీలిస్తే, భూభారతి పోర్టల్‌ను అడ్డాగా చేసుకుని ఒక ముఠా భారీ కుంభకోణానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ చార్జీలను ప్రభుత్వానికి చేరకుండా ఈ ముఠా కాజేస్తోంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ల సహాయంతో అసలు చలాన్ మొత్తాన్ని ఎడిట్ చేస్తూ, తక్కువ మొత్తాన్ని చూపిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జనగామలో ఒకే రోజు 10 చలాన్లకు సంబంధించి దాదాపు 8,55,577 రూపాయలను (8 లక్షల 55 వేల 5 వందల 77 రూపాయలు) పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
చలాన్లు ఎడిట్ చేసి మోసాలుఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు లోతైన విచారణకు ఆదేశించగా, జనగామ తహసిల్దార్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. యాదాద్రికి చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లను ఎడిట్ చేసి, పేమెంట్ జరిగినట్లుగా నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బంది సహకారం లేకుండా ఈ స్థాయి మోసం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీసీఎల్ఏ (CCLA) టెక్నికల్ టీమ్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి స్లాట్ బుకింగ్ సమయం నుండే ఈ తరహా మోసాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
టెక్నికల్ లోపాలను వాడుకుని కోట్లు కాజేస్తున్నారు
రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న భద్రతా లోపాలను కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. చలాన్ వెరిఫికేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ అక్రమాలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి: ఇలాంటి అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు అందాల్సిన కోట్లాది రూపాయల స్టాంప్ డ్యూటీ ఆదాయం ప్రైవేటు వ్యక్తుల పరమవుతోంది. ఇప్పటికే ధరణి పోర్టల్‌లోని లోపాలపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుండగా, ఇప్పుడు భూభారతి అక్రమాలు బయటపడటం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది.