అదొక సంచలన మర్డర్ కేసు.. అందరూ చూస్తుండగానే లాయర్ దంపతులను క్రూరంగా చంపిన ఆ ఘటనను ప్రజలు ఎవరు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడా సంచలనం కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. 


గట్టు వామన్‌రావు ఆయన భార్య నాగమణి హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారు. పోయిన ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో పట్టపగలే వీరిద్దరిని దారుణంగా హత్య చేశారు దుండగులు. కార్లో వెళ్తున్న న్యాయవాద దంపతులను దుండగులు మరో వెహికల్‌లో వచ్చి వారికి అడ్డుగా పెట్టారు. న్యాయవాదిని బయటికి లాగి కత్తులు, గొడ్డల్లతో విచక్షణరహితంగా నరికి చంపారు. ఇక ప్రాణభయంతో కారులోనే ఉన్న ఆయన భార్యను సైతం దారుణంగా హతమార్చారు. 


పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటనలో మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు ఆయన భార్య నాగమణి  మరణించారు. అయితే హంతకులు చంపుతున్న క్రమంలో అనుకోకుండా ఓ వ్యక్తి తీసిన వీడియో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ సంఘటన తర్వాత టిఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణ చేశాయి. ఇందులో ఏకంగా పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధు పేరు చెప్పినప్పటికీ పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని మృతుని బంధువుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. 


ఇక ఈ విషయంలో సిబిఐ జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఇప్పటివరకు తెలంగాణ పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగలేదని పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాధితులు. దీంతో శుక్రవారం తెలంగాణ డిజిపితో సహా 12 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 


ఈ హత్యలపై పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగానే జరుగుతోందని హైకోర్టు ధర్మాసనం గతంలో అభిప్రాయపడింది. ఈ కేసులో పోలీసులు ఇచ్చిన స్థాయిని నివేదికను పరిగణలోకి తీసుకొని ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే మృతుని తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో తిరిగి ఈ విషయంపై సిబిఐ జోక్యం చేసుకోవాలంటూ కోరడంతో ఈ సంచలన కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందని చర్చించుకుంటున్నారు.


అసలేం జరిగింది?


ఫిబ్రవరి 17 2021 వ తేదీన హైకోర్టు లాయర్లుగా పనిచేస్తున్న గట్టు వామనరావు -నాగమణి ఇద్దరూ మంథని నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అయితే కల్వచర్ల వద్దకు చేరుకోగానే వారిని దుండగులు అటకాయించి హతమార్చారు. ఈ కేసులో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు అయిన బిట్టు శ్రీనుతోపాటు కీలక అనుచరుడైన కుంటా శ్రీనివాస్ పేర్లు బయటకు వచ్చాయి. దీంతో అప్పటికప్పుడు పార్టీ వారిని సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంది. అయితే హైకోర్టు అడ్వకేట్లుగా పనిచేస్తున్న వీరికి కుంట శ్రీనివాస్‌తో గ్రామంలోని అనేక విషయాల్లో ఉన్న విభేదాలే హత్యకు కారణమని తర్వాత విచారణలో తేలింది. ఒకరకంగా ఈ కేసు పుట్ట మధు రాజకీయ భవిష్యత్తును పూర్తిగా ప్రమాదంలో పడేసింది. ఇక మేనల్లుడు బిట్టు శీను సైతం హత్యలు నేరుగా పాల్గొన్నట్టు ఆధారాలు లభించడంతో పూర్తి డిఫెన్స్‌లో పడిపోయారు పుట్ట మధు. పోలీసు విచారణ విషయంలో మాత్రం ఆరోపణలు రావడంతో ఇప్పుడు మళ్లీ వామన్ రావు తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏకంగా సిబిఐ రంగంలోకి దిగాలని కోరారు. ఇక ఈ విషయం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.