Korutla Crime News | కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హితీక్ష హత్య (Girl Murder In Korutla) కేసును పోలీసులు ఛేదించారు. బాలికను ఆమె చిన్నమ్మ మమత గొంతు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. తనను చిన్నచూపు చూస్తున్నారని, తనకు విలువ ఇవ్వడం లేదని భావించి తోడికోడలుపై కోపంతోనే ఆమె కూతుర్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి హితీక్షను చంపిన తర్వాత మృతదేహాన్ని బాత్రూంలో పడేసినట్లు గుర్తించారు. చిన్నారి హత్య కేసులో నిందితురాలిని అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు సోమవారం నాడు రిమాండ్ కు తరలించారు.
అసలేం జరిగింది.. జగిత్యాల జిల్లా కోరుట్లలోనీ ఆదర్శనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలిక హితీక్ష కొంత సమయానికి బాత్రూంలో శివమై కనిపించింది. ఈ ఘటన కోరుట్ల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అభం శుభం తెలియని చిన్నారిని గొంతు కోసి, ఇంత దారుణంగా ఎవరు చంపారు అని చర్చ జరిగింది. బంధువుల పనే అని మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బాలిక చిన్నమ్మ మమతే ఈ పని చేసి ఉంటుందని భావించి ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు.
వారి అనుమానమే నిజమైంది.. పట్టించిన డాగ్ స్క్వాడ్
పోలీసులు మొదట ఇంటి ఓనర్ పై అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో అతడికి ఫోన్ చేయగా వరంగల్లో ఉన్నట్లు తెలిపాడు. దాంతో అక్కడే ఉన్నవారు బాలికను హత్య చేసి ఉంటారని, బాగా పరిచయం ఉన్న వారి పనేనని గుర్తించారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ శనివారం రాత్రి ఘటన స్థలానికి చేరుకొని కొన్ని గంటలపాటు అక్కడ పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అనంతరం డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు చేయగా బాలిక హితీక్ష చిన్నమ్మ మమత ఇంటికి కుక్కలు వెళ్లి ఆగాయి. పోలీసులు మమతను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసింది తానేనని ఒప్పుకుంది.
పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటున్నా తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెట్టాలని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. చాలా కేసుల్లో తెలియని వారి కంటే తెలిసిన వాళ్ల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.