Peddapalli MP Ticket: పెద్దపల్లి నుంచి పార్లమెంటు బరిలో కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ బాస్ ఫిక్స్ చేశారా?

Koppula Eshwar contest from Peddapalli:పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు అనే చర్చ మొదలైంది.

Continues below advertisement

Koppula Eshwar likely to contest from Peddapalli Parliament: పెద్దపల్లి: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు అనే చర్చ మొదలైంది. పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా పెద్దపల్లి పార్లమెంటుకు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లలో ఒకరు పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడటంతో తెరవెనుక రాజకీయాలతో ఆయన పార్టీ మారారని వినిపిస్తోంది.

Continues below advertisement

కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారా? 
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కొప్పుల ఈశ్వర్ కు పార్టీ అధినేత కేసీఆర్ సమాచారం అందించారట. సీపీఐ ఎంఎల్ నుండి టీడీపీలో చేరిన అనంతరం కొప్పుల ఈశ్వర్ మొదటిసారిగా 1994లో మేడారం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమంలో కొప్పుల ఈశ్వర్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 2004లో మేడారం అసెంబ్లీ స్థానం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2008 మేడారం, 2009, 2010లో ధర్మపురి నుండి కొప్పుల ఈశ్వర్ వరుసగా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం 2014లో విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్ గా సేవలు అందించారు. 2018లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. మంచి రాజకీయ అనుభవంతో పాటు సింగరేణి కార్మికుల్లో మంచిపట్టున్న కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దించితే పెద్దపల్లి పార్లమెంట్ లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయవచ్చని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడటంతో కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అధినేత కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొప్పుల ఈశ్వర్ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలోను పెద్దపల్లి ఎంపీ సీటు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. చెన్నుర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన వారసుడిగా వంశీక్రిష్ణను పోటీ చేయించాలని యోచిస్తున్నారు. గతంలో వివేక్ తో పాటుగా ఆయన తండ్రి వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా సేవలు అందించారు. కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా వంశీక్రిష్ణ అదే స్థానం నుంచి బరిలో ఉండాలని వివేక్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఇక చెన్నూర్ ఎమ్మెల్యే దక్కించుకోలేకపోయిన మాజీ  ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఎంపీ టికెట్ ఇస్తారన్న వాదన సైతం ఉంది. ఇదే పార్లమెంట్ పరిధిలో అన్నదమ్ములైన వివేక్, వినోద్ లు ఎమ్మెల్యేలుగా ఉండగా... ఎంపీ టికెట్ కూడా ఆ  ఫ్యామిలీకి ఇస్తారా? వేరే వారికి ఛాన్స్ దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement