జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ సన్నిధిలో 'వారాహి' వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురికాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు.
రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన 'వారాహి' వాహనాన్ని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు. కాగా ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం)ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.
జనవరి 24కు వాయిదా..
జనసేన సేనాని పవన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎన్నికల కోసం ఊరూరా తిరిగేందుకు ప్రచార వాహనానికి వారాహి పేరు కూడా పెట్టారు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి తొలి పూజ చేయాలని పవన్ ఫిక్సయ్యారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత ఇష్టమైన ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొత్త ఏడాది జనవరి 2న కొండగట్టుకు వెళ్లి వారాహికి పూజలు చేయాలని భావించినా వాయిదా వేసుకున్నారు. తనకు అత్యంత ఇష్టమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జనవరి 24న తొలి పూజలను నిర్ణయించిన తర్వాతనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధానికి బయలుదేరనున్నారు.
ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనాన్ని పవన్ తనకు కావాల్సినట్లుగా తయారు చేయించారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు ఇప్పటికే రెడీ అయిన పవన్ ఇక ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ వాహనానికి అమ్మవారి పేరు పెట్టారు పవన్ కళ్యాణ్. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు... ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.
వారాహి కలర్, ఇతర అంశాలపై తీవ్ర చర్చ నడిచింది. వైసీపీ, జనసేన నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వాహనానికి వేసిన రంగు చట్ట విరుద్దమని చెల్లదని ఆర్టీఏ అనుమతి ఇవ్వదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పలువురు వైఎస్ఆర్‌సీపీ నేతలు అదే చెప్పారు. దీనిపై జనసేన క్లారిటీ ఇచ్చినా పదే పదే విమర్శలు చేశారు. జనసేన నేతలు తమకు చట్టాలు తెలియవా అని ప్రశ్నించారు. అంతా చట్ట ప్రకారమే చేశామన్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఓ రోజంతా వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.