CM KCR: బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవలే మరణించారు. అయితే ఈరోజు కరీంనగర్ లో దశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈక్రమంలోనే  సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకున్నారు. కేఎస్ఎల్ ఫంక్షన్ హాల్ కు వెళ్లి మల్లయ్య చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం నివాళులు అర్పించారు. మంత్రి గంగుల కమలాకర్ తో పాటు కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. ధైర్యంగా ఉండమని చెప్పారు. 






ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, వొడితెల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సంజయ్ కుమార్, సుంకే రవి శంకర్, కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ కనుమళ్ల విజయ, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, కె సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, దామోదర్ గుప్తా, బండ శ్రీనివాస్, అనిల్ కూర్మాచలం, కలెక్టర్ కర్ణన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణ, కార్యదర్శి రూప్ సింగ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఓరుగంటి ఆనంద్ తదితరులు ఉన్నారు.






జనవరి 4న మృతి చెందిన గుంగుల మల్లయ్య


తెలంగాణ బిసి సంక్షేమం, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం అలుముకుంది. మంత్రి గుంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) ఇటీవల కన్నుమూశారు. కరీంనగర్ లోని వారి నివాసంలో గంగుల మల్లయ్య జనవరి 4న తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే మంత్రి గంగుల కమలాకర్ కార్యక్రమాలను రద్దు చేసుకుని కరీంనగర్ లోని తమ ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు కాగా, అందులో చిన్న కుమారుడు మంత్రి కమలాకర్. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించారు. విచారం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న గంగులను సిఎం కేసీఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.