Varun Raj Death In US: అమెరికాలోని చికాగోలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ రాజ్‌ మృతిచెందాడు. అతను కోలుకోవాలని ఆశించిన వారి ప్రార్థనలు ఫలించలేదు.  ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌ రాజ్‌ చనిపోయినట్టు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు.


ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్‌ రాజ్‌ ఉన్నతచదువుల కోసం చికాగోలోని ఇండియానా రాష్ట్రానికి  వెళ్లాడు. అక్కడ వాల్పరైసో యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. గత నెల అక్టోబర్‌ 29న జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా... అకస్మాత్తుగా ఎదురుపడ్డ దుండగుడు  అతనిపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌ రక్తపు మడుగులో పడిపోగా.... స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడి వెళ్లి ఆస్ప త్రికి తరలించారు.  అప్పటి నుంచి లూథరన్‌ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం అందించారు. అతడు కోమాలోకి వెళ్లడంతో...  వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఎంత చేసిన వరుణ్‌ రాజ్‌ ప్రాణాలు మాత్రం నిలవలేదు. దుండగుడి చేతిలో కత్లిపోట్లకు గురైన వరుణ్‌... చికిత్స పొందుతూ... ప్రాణాలు  వదిలాడు. వరుణ్‌ రాజ్‌ మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్‌ జోర్డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతడు ఎందుకు దాడి చేశాడు... అనే విషయాన్ని అక్కడి పోలీసులు రాబడుతున్నారు.  మరోవైపు.. వరుణ్ రాజ్‌ మృతిపై వాల్పరైసో విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా సంతాపం ప్రకటించారు. ఈ క్రూరమైన దాడిని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి  తీవ్రంగా ఖండించారు. 


ఉన్నత చదువులు చదివితే మంచి భవిష్యత్‌ ఉంటుందని..  కోసం ఎంతో కష్టపడి పిల్లలను  విదేశాలకు పంపుతారు తల్లిదండ్రులు. కోటి ఆశలతో కన్నవారిని వదిలి  ఖండాంతరాలు దాటి వెళ్తారు విద్యార్థులు. తమ  సుదూరంగా ఉన్నా బిడ్డలు బాగానే ఉన్నారని... క్షేమంగా ఉన్నారని తల్లిదండ్రులు సంతృప్తి చెందుతారు. కానీ... విధి వక్రించినప్పుడు జీవితం తలకిందులవుతుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తుంది. ఖమ్మం జిల్లా విద్యార్థి పుచ్ఛా వరుణ్‌ రాజ్‌ విషయంలో ఇదే జరిగింది. అతను ఇకలేడన్న వార్త తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.