పెళ్లికి అంతా సిద్ధమై ఇంకా కాసేపట్లో తాళి కట్టడం ఉందనగా వరుడు ట్విస్ట్ ఇచ్చాడు. తనకు ఇచ్చే కట్నంలో భాగంగా బైక్ కొని ఇస్తేనే వధువు మెడలో తాళి కడతానని మొండికేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతటి డ్రామాలో ఉన్నట్టుండి ఎమ్మెల్యే ఎంట్రీ ఇవ్వడం, ఆయన సాయం చేసి, ఆయన చేతుల మీదుగానే పెళ్లి జరిపించడం జరిగాయి. బైక్ కొనివ్వలేదని ఓ పెళ్ళి కొడుకు ఏకంగా పీటల మీద పెళ్లి ఆపి, పెళ్లి కూతురుకు కన్నీళ్లు పెట్టించాడు. ఈ ఘటనను కళ్ళారా చూసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హామీ ఇచ్చి పెళ్లి జరిపించారు. బైక్ లక్ష రూపాయల నగదు ఇచ్చి ఆగిపోయిన పెళ్లి జరిపించి, తన ఔధార్యాన్ని చాటుకున్నారు.


కరీంనగర్ జిల్లా అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ కూతురు అనూష వివాహం కుదిరింది. కట్నం కింద రూ.5 లక్షలతో పాటు బైక్ ఒప్పుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికీ అప్పోసప్పో చేసి పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్ట జెప్పారు. ఈ రోజు (మే 12) కేశవ పట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉండగా నాకు బైక్ కొనిస్తేనే అమ్మాయి మెడలో తాళి కడతాను లేకపోతే వెళ్ళిపోతాను అంటూ పెళ్లి కొడుకు భీష్మించడంతో పెళ్ళి కూతురు కుటంబ సభ్యులంతా కన్నీటి పర్యంతం అయ్యారు.


దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల మధ్య కాస్త గొడవ జరిగింది. పెళ్లి తర్వాత బైక్ కొనిస్తామని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పినా వరుడు వినలేదు. పెళ్లి చేసుకునేదే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. దీంతో పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టకున్నారు.


ఎమ్మెల్యే ఎంట్రీ


అదే సమయానికి పెళ్లికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. ఈ ఘటనను చూసిన ఎమ్మెల్యే రసమయి, పెళ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పారు. బైక్ తాను కొనిస్తాను అంటూ రూ.50 వేల నగదును పెళ్లి కొడుకు తండ్రి చేతిలో పెట్టాడు. మిగతా డబ్బు షోరూంకి పంపిస్తాను అని హామీ ఇచ్చారు. దీంతో పెళ్ళికి అంగీకరించిన పెళ్లి కొడుకు వినయ్, అనూష మెడలో తాళి కట్టడంతో కథ సుఖాంతం అయింది. రసమయి బాలకిషన్ స్వయంగా దగ్గరుండి పెళ్లి పనులు అన్ని చూసుకుని, తోబుట్టువు లాంటి చెల్లెలి పెళ్ళికి కట్నంగా బైక్ హామీ ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రసమయి ఔదార్యం పట్ల అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు.