Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మంగపేట గ్రామస్తులు దశాబ్దాలుగా ముంపు సమస్య ఎదుర్కొంటున్నారు. కాలాలతో సంబంధం లేకుండా నీటిని వారి గ్రామ చెరువుకి వదిలినప్పుడల్లా ఇళ్లలోకి నీరు చేరడం సాధారణమైపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా గంగాధర ఎల్లమ్మ చెరువుని ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో నీటితో నింపుతున్నారు. దీంతో ఆ చెరువు పక్కనే ఉన్న ఈ మంగపేట గ్రామంలోని ఇండ్లు, వ్యవసాయ భూములు బావులు ముంపునకు గురయ్యాయి. దాదాపు 90 ఎకరాల వరకూ పచ్చని పంట పొలాలు, అందులో మునిగిపోయాయి. దీంతో పలువురు రైతుల జీవనోపాధి దెబ్బతింది. అయితే, ఎవరికీ కూడా సరైన నష్టపరిహారం అందలేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు, ఊరికి కనీసం రోడ్డు సౌకర్యం లేదని అక్కడ ఉన్న బ్రిడ్జి వల్ల కూడా ప్రయాణం చేయాలంటేనే భయమేసే విధంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇక వర్షాకాలంలో అయితే పాములు, తేళ్లు ఇళ్లలోకి రావడం సాధారణంగా తయారైందని అంటున్నారు. నాలుగేళ్ల నుండి సర్వే పేరిట వస్తున్నారు పోతున్నారు తప్ప అధికారులు కూడా తమకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.


ఇక తమ తాతలు తండ్రులు బతికిన ఈ ఊరిలో తాము మాత్రమే మిగిలే పరిస్థితి ఉందని మరో వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కులవృత్తి చేసుకుని బతికే మహిళల పరిస్థితి మరో విధంగా ఉంది. తాము గొర్రెలు కాచుకుంటూ తమ కుటుంబాన్ని వెళ్లతీసుకొని జీవనోపాధి పొందే వారమని ఇప్పుడు ఎటు వైపు మేతకు తీసుకుని వెళ్లే పరిస్థితి లేక తాము తమ జీవనాధారం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.


ఇక అసలు వీరు రహదారిగా చెపుతున్న ఈ బ్రిడ్జి పరిస్థితి దారుణంగా సాధారణంగా మెట్రో నగరాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి వాడే డిజైన్ ని ఇక్కడ ప్రధాన రహదారిగా మార్చారు అధికారులు. బైక్ ని బ్రిడ్జిపై నుండి వెళ్ళడానికి మొదటిసారిగా ప్రయత్నించడంతో తమకు తీవ్రమైన భయం ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు. కేవలం నాలుగైదు అడుగుల వెడల్పుతో కట్టిన ఈ బ్రిడ్జి తమకు రవాణా సౌకర్యంగా  మారిందని అంటున్నారు.


ఇక ఊరంతా కలిసి చందాలు వేసుకొని మరీ ఇటు ఈ బ్రిడ్జి నుండి అటు చెరువు సమస్య నుండి బయట పడాలని నిర్ణయించుకున్నారు. అందుకే అందరూ కలిసి తలా కొంత చందాలు వేసుకొని స్థానిక గుట్ట ప్రాంతాన్ని చదును చేసుకుని కొత్త ఊరి నిర్మాణం మొదలుపెట్టారు. పాత ఊరి జ్ఞాపకాలను వదిలి అక్కడ నుండి వెళ్లిపోవాలని  అనుకుంటున్నారు. ఒక ఊరికి వచ్చిన కష్టాన్ని ఐకమత్యంగా ఉంటేనే తాము బయట గలమని వారంతా భావిస్తున్నారు.