కరీంనగర్: ప్రజలకు ఆపద వచ్చిందంటే ముందుగా అడుగు వేసి పోలీసులు. కానీ కొందరు పోలీసులు ఒంటిపై ఖాకీ చొక్కా ఉందని తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరగగా, డిపార్ట్‌మెంట్ విచారణ జరిపి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. తాజాగా కరీంనగర్ నగరంలో త్రీ టౌన్ ఎస్ఐ ఎన్.చైతన్య చందర్ ప్రవర్తన వివాదాస్పదంగా మారడంతో, ఉన్నతాధికారులు ఆయనపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక సామాన్యుడిపై విచక్షణారహితంగా దాడి చేసినందుకుగానూ కరీంనగర్ సిపి గౌస్ ఆలం సదరు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Continues below advertisement

అసలేం జరిగిందంటే.. కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కరీంనగర్ లోని ఖాన్‌పురా ప్రాంతంలో ఉన్న ఒక సెలూన్ షాపునకు హెయిర్ కటింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో షాప్ నిర్వాహకుడు రాములు ఎస్ఐని ఉద్దేశించి గౌరవంగా అన్నా కూర్చో అని అన్నాడు. అయితే, ఈ మాట విన్న ఎస్ఐ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఒక సామాన్యుడు తనను "అన్నా" అని పిలవడం ఏమిటని, ఒంటిమీద ఖాకీ యూనిఫాం ఉందని అహంకారంతో ఊగిపోయి, రాములును అసభ్య పదజాలంతో దూషిస్తూ అతనిపై దాడికి దిగారు.

ఎస్ఐ దురుసు ప్రవర్తన మొత్తం సెలూన్ లోని సిసిటివి (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. సిసి ఫుటేజీని పరిశీలించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, విధి నిర్వహణలో బాధ్యతారహితంగా ప్రవర్తించి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసినందుకు ఎస్ఐ చైతన్య చందర్‌ను సస్పెండ్ చేశారు.