గతంలో కాంగ్రెస్ హయాంలో రాజీవ్ స్వగృహ పథకం పేరుతో మొదలైన ఇంటి స్థలాల కేటాయింపు ప్రస్తుతం రియల్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చుకునే సమయానికి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ప్లాట్లుగా చేసి విక్రయించడం మొదలుపెట్టింది. దీంతో గవర్నమెంట్ కి అయితే భారీ ఎత్తున ఆదాయం దక్కింది కానీ మొదలుపెట్టిన ఆశయం మాత్రం నెరవేరలేదు.


కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ స్వగృహ భూమి ఉన్న ప్రాంతం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామంలో ఉంది అంగారిక టౌన్షిప్ పేరుతో ప్రభుత్వం మొదటి విడత ప్లాట్ల వేలం నిర్వహించగా పాల్గొన్న వారిలో ఎక్కువ మంది రియల్టర్లు ,కాంట్రాక్టర్లు, ఇతర బడా వ్యాపారస్తులు ఉన్నారు.


ఏమిటి ఈ అంగారిక కథ?
2007వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరలో మధ్య తరగతి పేద వారి కోసం సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకై ప్రచారం చేయగా  కరీంనగర్లో 7524 మంది ఐదు వేల రూపాయల చొప్పున మూడు కోట్ల 76 లక్షల 20 వేల రూపాయలు ప్రభుత్వానికి డిపాజిట్ చేశారు. దీంతో రామకృష్ణ కాలనీ వద్ద రెండు కోట్ల రూపాయలతో 90 ఎకరాల భూమిని సేకరించింది అప్పటి ప్రభుత్వం. మొత్తం 44 బ్లాకులుగా నిర్మించాలని  నిర్ణయించుకుంది. అయితే 2008 సంవత్సరంలో శంకుస్థాపన చేసి కొంత వరకు నిర్మించి వదిలేశారు సదరు సంబంధిత శాఖ అధికారులు. మరోవైపు ఈ భూములకు సంబంధించి ధరలు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయాయి.


ప్రభుత్వం ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా తిరిగి తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో దరఖాస్తుదారులు కోర్టులో కేసు వేశారు. అయితే ఆ కేసు పెండింగ్లో ఉండగానే వీరి బాధలను పట్టించుకోకుండా అక్కడ అంగారిక టౌన్ షిప్ పేరుతో లే అవుట్ చేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ 90 ఎకరాల భూమిలో 819 ప్లాట్లకు గానూ తొలి విడతలో 237 ప్లాట్లకు వేలం నిర్వహించగా నాలుగు రోజుల వేలంపాటలోనే సుమారు 56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తంగా చివరి రోజుతో కలిపి దాదాపుగా మరో పది పన్నెండు కోట్ల రూపాయలు వరకూ రానున్నాయి. డిపాజిట్ దార్ల రెండు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించిన ప్రభుత్వానికి 250 కోట్ల వరకు పూర్తిస్థాయిలో ఆదాయం వస్తుందని ఒక అంచనా.. దీంతో చీమలు పుట్టలు పెడితే అందులో పాములు దూరినట్టుగా అయింది.