Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య దివ్య ఐదు రోజుల క్రితమే సూసైడ్ చేసుకుంది. ఇంతలో ఆయన కూడా ఇలా చనిపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. 

ఒకే కుటుంబంలో కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన రెండు వరుస మరణాలు కరీంనగర్‌ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రాణ సమానంగా ప్రేమించిన భార్య అకాల మరణాన్ని తట్టుకోలేక, ఆమె లేని లోటును భరించలేక ఓ బాధ్యతాయుతమైన పోలీస్‌ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య చనిపోయిన ఐదు రోజులకే ఆయన కూడా అదే బాట పట్టడం స్థానికంగా అందర్నీ కలిచివేసింది.

కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్‌ చంద్రశేఖర్ శనివారం సూసైడ్ చేసుకున్నారు. జమ్మికుంట మండలం పరిధిలోని సీతంపేటలో ఉన్న తన అత్తవారి ఇంటికి వెళ్లి అక్కడే ఉరేసుకొని ప్రాణాలు విడిచారు. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉండే చంద్రశేఖర్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. 

ప్రేమించిన భార్య మరణమే ప్రధాన కారణం

చంద్రశేఖర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం భార్య దివ్య మృతి అని స్థానికులు చెబుతున్నారు. సరిగా ఐదు రోజుల క్రితం దివ్య ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. గత మంగళవారం మధ్యాహ్నం ఆ నొప్పిని భరించలేక గన్నేరు పువ్వుల రసం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 

ఆ సమయంలో విధుల్లో ఉన్న చంద్రశేఖర్‌కు దివ్య ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి దివ్య మరణించింది. దివ్య తండ్రి తెడ్ల చిన్న సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

భార్య మరణించినప్పటి నుంచి చంద్రశేఖర్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆమెతో గడిపిన జ్ఞాపకాలు, ఆమె లేని ఒంటరితనం ఆయనను కుంగదీశాయి. హనుమాన్ నగర్‌లో నివసిస్తున్న చంద్రశేఖర, భార్య మరణం తర్వాత తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. చివరకు భార్య మరణించిన ఐదు రోజులకే ఆమె వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకొని సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో రెండు కుటుంబాలు కోలుకోలేని విషాదంలో మునిగిపోయాయి.