Karimnagar News: కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ఆకస్మికంగా బుధవారం అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులకు దిగారు. వారి కార్యాలయాలను సైతం వదలకుండా అడుగడుగునా తనిఖీలు చేశారు. మొత్తం 37 ఇళ్లపై దాడి చేసి 11 మంది అక్రమ వడ్డీ వ్యాపారుల నుండి రూ.52.57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


జోరుగా వడ్డీ వ్యాపారం..
పెరుగుతున్న పట్టణీకరణతో పాటు అనేక రకాల చిరు వ్యాపారులకు కరీంనగర్ కేంద్రంగా మారింది. అయితే బ్యాంకులలో రుణాలు పొందలేని ప్రజలు అక్రమంగా వడ్డీ ఇచ్చే వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి అవసరాన్ని బట్టి 5 నుండి 10 శాతం వరకూ వడ్డీని వసూలు చేస్తూ వీరంతా వ్యాపారం చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. ఇలా తీసుకున్న వారు కేవలం సంవత్సరంన్నర వ్యవధిలోనే దాదాపు పూర్తి అసలు చెల్లించాలి. దీని కోసం అప్పుడప్పుడు బంగారం లేదా వస్తువులు కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇక ఇంటికి సంబంధించిన, భూమికి చెందిన పత్రాలపై అప్పు ఇస్తూ అదే రకమైన వడ్డీని కొందరు వసూలు చేస్తున్నారు. పైగా ఇంటికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో హక్కులు ఉండేలా తమ పేరున వడ్డీ వ్యాపారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. విధి లేక సదరు ఇంటి యజమాని వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి అయ్యే ఖర్చులను సైతం భరించాల్సి వస్తుంది. చెల్లించకపోతే ఆ ఆస్థి వారిపేరుపైకి బదిలీ అవుతుంది.


పాల్గొన్న పలువురు సిబ్బంది
ఇద్దరు అదనపు డీసీపీల ఆధ్వర్యంలో బుధవారం ఏకకాలంలో 37 ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడి చేసి అప్పు కింద రాయించుకున్న ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు, పత్రాలతో పాటు ఇంట్లో నిల్వ ఉంచిన నగదును సైతం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు.


ఇదే మొదటిసారి
కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారాన్ని నిరోధించడానికి ఇంత భారీ ఎత్తున దాడులు చేయడం ఇదే మొదటిసారి. హుజురాబాద్ లో ఆరుగురు కరీంనగర్ డివిజన్లో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఇలాంటి వ్యాపారం చేసే వారందరి సమాచారం తెప్పించుకొని వారిపై నిరంతరం నిఘా ఉంచుతామని అన్నారు.


పట్టుబడింది వీరే..
కరీంనగర్ డివిజన్లో మల్యాల అంజయ్య, కొండా మురళి, శ్రీనివాసాచారి, రవీందర్, సుధాకర్, హుజురాబాద్ డివిజన్ లో ఆనందం, సదానందం, సదాశివ, నర్సయ్య, భాస్కర్ లపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ అక్రమంగా వడ్డీ వ్యాపారం చేసే వారిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండడం సైతం విశేషం.