Karimnagar News: తల్లిదండ్రులు, తోబుట్టువులకు, పుట్టిన ఊరికి దూరంగా ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లోని హాస్టల్ లో ఉంటారా చాలా మంది. ప్రైవేట్ హాస్టల్స్ అంటేనే అధిక ఫీజులు వసూలు చేసి నాసిరకమైన వసతులు కల్పిస్తారనే అపవాదు ఉండనే ఉంది. దీనికి ప్రైవేట్ హాస్టల్స్ లో వడ్డించే ఆహారం గురించి ఎంత చెప్పినా తక్కువే. రుచీ పచీ ఉండదు. సాంబారు నీళ్లలా ఉంటుంది. చెడిపోయిన కూరగాయలతో వంటలు చేస్తుంటారనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఇలా ఒకటీ రెండూ కాదు ప్రైవేట్ హాస్టల్స్ తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఓ ప్రైవేట్ హాస్టల్ లో పని చేసే మహిళ చేసిన పాడు పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..?
కరీంగనర్ జిల్లా కేంద్రం మంకమ్మతోటలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో వంట మనిషి చేసిన నిర్వాకం మరోసారి ప్రైవేట్ హాస్టళ్ల తీరు చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళ వంట గదిలో ఉంటూ పని చేస్తున్న సమయంలో మూత్రం రావడంతో వంట పాత్రలోనే మూత్ర విసర్జన చేసింది. తర్వాత ఆ మూత్రాన్ని సింక్ లో పడేసింది. ఆ పాత్రనే తర్వాత వంటలకు ఉపయోగించింది.
వంటకాలు కంపు వాసన కొట్టడంతో ఆ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న వారు యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చారు. మూత్రం కంపు వస్తోందని వారికి చెప్పారు. దీంతో యాజమాన్యం వంట గదిలో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ చేసిందంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
అది చూసిన విద్యార్థులు వారు తినే ఆహారాన్ని తలచుకుని వికారించుకుంటున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా ఆ మహిళపై, ఆ ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యంపై ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులంతా కలిసి ఫిర్యాదు చేసినా అధికారులు ఆ హాస్టల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళను ఆ ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం పనిలో నుండి తొలగించినట్లు తెలుస్తోంది.