Karimnagar News: గత కొద్ది నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కేంద్ర ఏజెన్సీల వరుస దాడులు కలవరం రేపుతున్నాయి. హోం శాఖ పరిధిలోకి వచ్చే కీలకమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,  ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు.. పలు వేరు వేరు కేసులను విచారించడానికి దూకుడు పెంచాయి. అన్ని కేసులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో లింకు ఉండడమే ఇక్కడ విచిత్రం. అప్పటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసు నుంచి నిన్నటి ఈడీ దాడుల వరకు కరీంనగర్ లోని వ్యక్తులే ఏజెన్సీలకు టార్గెట్ అవుతున్నాయి.


మొదట  ఎన్ఐఏ..


ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నిజామాబాద్ కేంద్రంగా "పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా "అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో తమ మతానికి చెందిన యువకులకు ఆయుధ శిక్షణ ఇవ్వడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దీనిపై దృష్టి సారించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నతాధికారులు నిజామాబాద్‌లో అతన్ని అరెస్టు చేసిన వెంటనే అతని ఇచ్చిన సమాచారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తులో మరో మతానికి చెందిన నాయకులను, పండుగలను టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ ని మొదట్లోనే వమ్ము చేశారు. అయితే ఈ కేసులో జిల్లాకు చెందిన పలువురు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. చివరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసే వరకు వెళ్లింది.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కరీంనగర్ వాసి..


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వెన్నమనేని శ్రీనివాసరావు కీలక పాత్ర వహించారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకోవడంతో జిల్లా మరొక్క మారు ఉలిక్కిపడింది. శ్రీనివాసరావుకి కరీంనగర్‌లోని పలువురు నాయకులు, అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఒక్కసారిగా జిల్లాలో సంచలనం రేకిత్తించింది. పైగా కోట్ల కొద్ది సొమ్ము వివిధ మార్గాల ద్వారా తరలించారని ఆరోపణలు రావడంతో లోతుగా విచారించడానికి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సమాచారం రాబట్టే పనిలో పడ్డారు. దీంతో ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందోనని టెన్షన్ కరీంనగర్ చెందిన కొందరు వ్యక్తుల్లో నెలకొంది. మరోవైపు నకిలీ ఐటీ కంపెనీలతో డబ్బులు తరలించాలని పేర్కొనగా ఐటి కంపెనీ యజమానులు సైతం జిల్లాకు చెందిన వారిని ఏజెన్సీ అధికారులు గుర్తించారు ఇప్పటికీ రోజుకో మలుపు తిరుగుతున్న లిక్కర్ స్కాం చివరికి జిల్లా వాసుల్లో ఇంకా ఎవరి అరెస్టులకు దారితీస్తుందోనని చర్చించుకుంటున్నారు.


ఏకంగా మంత్రి ఇంటిలోనే వివరాల సేకరణ!


దాదాపుగా దశాబ్ద కాలం కిందట కరీంనగర్ కు చెందిన గ్రానైట్ కంపెనీలు అక్రమంగా విదేశాలకు పెద్ద ఎత్తున బ్లాక్ లను తరలించి పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని అటు సీబీఐ, ఇటు ఈడీ, ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు జరపడం పెను సంచలనానికి కారణమైంది. జిల్లాకి చెందిన కీలక నేత మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలో సోదాలతోపాటు... ఏకంగా ఆయన ఇంటి తాళం పగల కొట్టి మరీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మరోవైపు హుటాహుటిన దుబాయ్ పర్యటనను విరమించుకొని వచ్చిన గంగుల కమలాకర్ దర్యాప్తుకు సహకరిస్తారని పేర్కొన్నారు. అయితే కమలాకర్ తో పాటు దాడులకు గురైన కంపెనీలన్నీ కరీంనగర్ కి చెందినవే కావడం గమనార్హం.


దీంతో దేశ వ్యాప్తంగా వివిధ కేసుల్లో కేంద్ర ఏజెన్సీల విచారణకు కరీంనగర్ సెంటర్ గా మారుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల కేంద్ర ఏజెన్సీలు కరీంనగర్ ని వరుస పెట్టి టార్గెట్ చేస్తున్నాయని రానున్న రోజుల్లో ఇది ఎటువైపు దారి తీస్తుందోనని చర్చించుకుంటున్నారు.