Congress MP Candidates - కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం కసరత్తు పూర్తి చేయకముందే.. మరొక వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు లు టికెట్టు కోసం పోటి పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్టు వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో మరొక వ్యక్తి తీన్మార్ మల్లన్న కూడా  రీంనగర్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. ఇదివరకు దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికి కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఎంపికలో‌ నెలకొన్న పీటముడి మాత్రం ‌వీడటం‌ లేదు. దీంతో టికెట్లు ఆశిస్తూ పోటీ పడుతున్న ఆశావాహుల్లో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు నేతలు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
కరీంనగర్ బరిలో బండి సంజయ్, వినోద్ కుమార్
బీజేపీ ‌పార్టీ నుండి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమర్, బీఆర్ఎస్ నుంచి‌ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ అదిష్టానాలు స్పష్టం చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఇంకా దోబూచలాడుతూనే ఉంది. ఎన్నికల కోడ్ విడుదలై దాదాపు 2 వారాలు కావస్తున్నా కాంగ్రెస్ అధి‌ష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో తాత్సారం చేస్తోంది. అధిష్టానం నిర్ణయం ఏమిటో అర్ధం కాకుంటా ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు అయోమయానికి గురవుతున్నారు. 
పొన్నం ప్రభాకర్ మాట నిలబెట్టుకుంటారా?
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు తనయడు వెలిచాల రాజేందర్ రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డిలతో పాటు రుద్ర సంతోష్ కుమార్ లు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అల్గి రెడ్డి ప్రవీణ్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. తీరా టికెట్టు వచ్చే సమయానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని టికెట్టు కోసం‌‌ విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు అలిగి రెడ్డి ప్రవీణ్ ను బుజ్జగించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్టు వచ్చేలా తన వంతు ప్రయత్నం చేస్తానంటూ హామీతో పొన్నం టికెట్ చేజిక్కుంచుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై మంత్రి పదవి పొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థి ఎంపికలో పొన్నం పాత్ర కీలకంగా మారింది. గత ఎన్నికల్లో తనకు పొన్నం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇప్పిస్తారా?  లేక అధిష్టానం నిర్ణయించే నేతకు జై కొడతారా అనేది తేలాల్సి ఉంది.


మరోవైపు అధికార పార్టీ మాత్రం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎంపికలో ఇంకా మల్లాగుల్లాలు పడుతూనే ఉంది. ఇద్దరు అభ్యర్థుల్లో వెలమ సామాజిక వర్గం ఓవైపు, రెడ్డి  సామాజిక వర్గం మరో వైపు బలాబలాపై పార్టీ అధిష్టానం ఇంకా లెక్కలు వేసుకుంటూ తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం‌నుంచి వెలిచాల రాజేందర్ రావు ఎంపీ కోసం పోటి పడుతున్నప్పటికి అధిష్టానం వీరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయడంపై కసరత్తు చేస్తోంది. వెలమ సామాజిక వర్గం వెలిచాల రాజేందర్ రావుకే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ నేత చెబుతున్నారు. దీంతో టికెట్టు కేటాయింపులో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది.