Venkateshwara Temple Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఈ ఆలయ నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్ సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు, అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ఏపీ సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ఆలయం కరీంనగర్ లో కొలువుదీరడం తమ అదృష్టం అని చెప్పారు. ఆలయానికి 10 ఎకరాల భూమి మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ విజ్ఞప్తిని మన్నించి టీటీడీ ఆలయం కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు  చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం తమకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. 


టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... తిరుమలలో మాదిరిగానే కరీంనగర్ లోనూ సర్వ కైంకర్యాలు జరుగుతాయని అన్నారు. టీటీడీ తరఫున అర్చకులు, సిబ్బంది, ప్రసాదంతో పాటు పాలు తదితరాలు ఉంటాయన్నారు. కరీంనగర్, తెలంగామ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.  అలాగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డిని సత్కరించారు. 










ఈరోజు జరిగే శంకుస్థాపన మహోత్సవానికి హాజరు కావాలని పట్టణంలో తిరిగి మరీ ప్రజలను ఆహ్వానించారు మంత్రి గంగుల కమలాకర్.