తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ లక్ష్యంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటేనని చెబుతూ వస్తున్న బండి సంజయ్ తాజాగా మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆరే డిసైడ్ చేస్తారంటూ మాట్లాడారు. ఆదివారం (జూన్ 18) ఆయన కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో బీజేపీ మహాజన్​ సంపర్క్​ అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. దాదాపు 30 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కేసీఆర్ సిద్ధం చేశారని అన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్​ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.


45 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్​ గెలుస్తుందని అనడం హాస్యాస్పదమని టీపీసీసీ అధ్యక్షుడు​ రేవంత్​ రెడ్డి అనడాన్ని తప్పుబట్టారు.


భవిష్యత్తులో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి ఎప్పుడో చెప్పారని బండి సంజయ్ అన్నారు. రాష్ర్టపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రతిపాదించినప్పుడు ఆమెను ఓడించాలని రెండు పార్టీలు ప్రయత్నించాయని, కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్​ ఆర్థిక సాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ర్టంలో  బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వస్తుందని తెలిసే సీఎం కేసీఆర్​ మళ్లీ కాంగ్రెస్​ పార్టీని పైకి లేపాలని చూస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీని ఎంత లేపిన లేచే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ ఇప్పుడు ప్రధాని మోదీని తన మిత్రుడిగా ఎందుకు చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. 


బీజేపీ సిద్ధాంతాలను, మోదీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చే వారిని తాము స్వాగతిస్తామని అన్నారు. ఎవరో రావాలని తాము చూడట్లేదని అన్నారు. బీజేపీలోంచి కొంత మంది వెళ్లిపోతున్నారంటూ సోషల్​ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని అన్నారు. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లిపోవడం లేదని స్పష్టం చేశారు. 


హోంమంత్రి వ్యాఖ్యలపైనా స్పందన


హోం మహమూద్ అలీ వ్యాఖ్యలపైనా బండి సంజయ్ స్పందించారు. అసలు రాష్ర్టంలో హోంశాఖా మంత్రి ఉన్నారా అని ఎద్దేవా చేశారు. హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే ఆయన ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. హిందూ ప్రజలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. 18 రాష్ర్టాల్లో బీజేపీ గెలిచినప్పుడు మాట్లాడని కాంగ్రెస్​ నేతలు, కర్ణాటకలో గెలవగానే ఎగిరెగిరిపడుతున్నారన్నారని అన్నారు. కన్నడ నాట కాంగ్రెస్​ గెలవగానే మత మార్పిడి బిల్లు తెచ్చారని, దీంతో మళ్లీ హిందూ సమాజం ఏకమవుతోందని అన్నారు.


మహిళల దుస్తుల మీద కాకుండా.. ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టాలని సూచించారు. అసలు మహమూద్ ఆలీ హోంమంత్రి అని ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వస్తారని సీఎం కేసీఆర్ వస్తారా? అని సవాల్ విసిరారు. పరేడ్ గ్రౌండ్‌లో చర్చకు రావాలని అన్నారు. హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై పార్టీలో చర్చిస్తామని, తెలంగాణకు ఏది మంచో అదే చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్ల నిధులు కేటాయించినట్లు బండి తెలిపారు.