రాష్ట్రమంతటా వాతావరణం మారుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షాకాలానికి ముందుగా వచ్చే ఈదురుగాలులు ప్రతిరోజూ సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకూ కొనసాగుతున్నాయి. అయితే వేగంగా వీచే గాలుల వల్ల ప్రధాన రహదారుల వెంట ఉన్న పురాతన చెట్లు నేడో, రేపో కూలే విధంగా ఉన్నాయి. పట్టణంలో ఉన్న అనేక హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కానీ ప్రమాదకరమైన పరిస్థితి లో ఉన్నాయి... గతంలో జరిగిన సంఘటనలు అప్పట్లో ఆందోళన కలిగించినా ఈ సారి కూడా అధికారులు సిద్ధపడిన విధంగా కనిపించడం లేదు. ఏదైనా తీవ్ర నష్టం జరిగిన తర్వాతే గానీ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.


 పట్టణంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగులు పలు భవనాలపై భారీ ఎత్తున వెలసి ఉన్నాయి. ఈ బోర్డులకు సంబంధించి పర్మిషన్ లు తీసుకునే వారు స్థానిక మున్సిపల్  లేదా కార్పొరేషన్ లోని సంబంధించిన  అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు భద్రతా పరంగా ఎక్కడ హోర్డింగ్ పెడుతున్నారు అనే  దానికి సంబంధించి కూడా అధికారులకు సదరు యాడ్ ఏజెన్సీ వాళ్ళు ముందే చెప్పాల్సి ఉంటుంది. బలమైన ఇనుప బేస్ లకి ఫ్రెములను బిగించి తయారు చేసినప్పుడు మాత్రమే హోర్డింగులు ఎలాంటి ఈదురు గాలైనా తట్టుకోగలవు. కానీ డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా కొన్ని సంస్థలు తక్కువ క్వాలిటీతో కూడిన బోర్డులను వివిధ ప్రాంతాల్లో అమర్చాయి. ఇందులో చాలా వరకూ సరైన పర్మిషన్ లేకుండానే పెట్టారు. ఎంతో కొంత ఆదాయం వస్తోందని సదరు బిల్డింగ్ ఓనర్లు కూడా తమ భవనాల పై ఉన్న ఖాళీ స్థలాన్ని లీజు పద్ధతిన ఇస్తూ ఉంటారు. కానీ ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని మాత్రం ఆలోచించరు.


గత సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంలో ఏర్పర్చిన భారీ హోర్డింగులు ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో భారీగా వర్షం ఉండటంతో ప్రజలెవరూ రోడ్డుపై లేరు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.


ఇక హైవేలపై కూలుతున్న పురాతన వృక్షాలు మరొక సమస్య. కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే దారిలో కొండ గట్టు సమీపంలో దశాబ్దాల నాటి పురాతన వృక్షాలు చాలా ఉన్నాయి. గతంలోనూ భారీ ఈదురు గాలులు వీచిన సమయంలో అంత పెద్ద చెట్లు రోడ్డుపై పడి పోయేవి. అదృష్టవశాత్తు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం ఇప్పటివరకు పెద్దగా జరగలేదు. కానీ అధికారుల తీరు మాత్రం ఏదో ఒక సమస్య వచ్చి పడే వరకూ వేచి చూసేలా ఉంది. ఎలాగూ రహదారి విస్తరణ చేస్తారు కాబట్టి ఇప్పటికైనా కూలిపోయే విధంగా ఉన్న కొన్ని చెట్లను తీసి వేయడం మంచిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముందే మేలుకుంటే జరగాల్సిన ప్రమాదాలను తప్పించవచ్చు అని ప్రజలు భావిస్తున్నారు. అధికారులు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.