Karimnagar News: సమ్మర్ హాలిడేస్ ముగిశాయి.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మొదలు పెట్టింది. ఇక కీలకమైన పుస్తకాలు, యూనిఫాం లాంటివి పిల్లలకు ఇప్పటి వరకు అందలేదు. మరోవైపు గవర్నమెంట్ స్కూల్స్ లో దాదాపు వారంలో మూడు రోజుల పాటు అంటే సోమ, బుధ, శుక్రవారాలు మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డును అందించడం మొదటి నుండి చేస్తోంది. దీనివల్ల పోషకాహార లోపాన్ని తగ్గించాలని గతంలో ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలు పెట్టింది. అయితే సోమవారం జరిగిన మొదటి రోజు స్కూల్  మిడ్ డే మీల్స్ లో కోడి గుడ్డు అందించలేదు.


 ఎందుకిలా?
గత కొద్ది కాలంగా కోడి గుడ్ల రేట్లు అమాంతంగా పెరిగాయి. దీంతో అప్పటి వరకు సరఫరా చేసిన బిల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనిపై పలుమార్లు సదరు కాంట్రాక్టర్లు తమ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు కోడి గుడ్డు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం జనవరి ఫిబ్రవరి వరకు సప్లై చేసిన వారికి  మాత్రమే ఇప్పటివరకు చెల్లించింది. అంటే దాదాపుగా మొత్తం కలిపి ఆరు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయని అందుకే తాము సప్లై చేయలేకపోయామని కాంట్రాక్టర్లు అంటున్నారు. తాము హేచరిస్ ల వద్ద నేరుగా డబ్బు చెల్లించి తీసుకొని వస్తామని కానీ కాంట్రాక్టు వచ్చినందుకు తమకు పెను భారం అవుతోందని వారు అంటున్నారు. మరోవైపు ధరను కోట్ చేసినప్పటి నుండి తమకు టెండర్లలో రెండోసారి మళ్లీ మార్చే అవకాశం ఉండదని ఇలాంటి సమయంలో కోడి గుడ్డు ధర విపరీతంగా పెరగడంతో తాము ఇప్పటికే నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వ స్పందన ఇలా..
ఇక దీనిపై ప్రభుత్వం సైతం స్పందించింది. కోడి గుడ్డు ధర పెంపునకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవి అమలు కావడానికి సమయం పడుతుండటంతో పిల్లలకు ఎగ్ లెస్ మీల్స్ పెట్టాల్సి వస్తోంది. ఇక ఇప్పటివరకు నాలుగు రూపాయలు ఉన్న కోడి గుడ్ల రేట్లను ఐదు రూపాయలకు పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో ఆర్టి నెంబర్ 42 ను విడుదల చేశారు. కానీ బయట మార్కెట్లో ఉన్న రేటుకు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా తోడైతే నిజంగా వర్కౌట్ అవుతుందో లేదో అని కాంట్రాక్టర్లు ఆలోచిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో అసలు మంచి పౌష్ఠికాహారం అయిన కోడిగుడ్డు పిల్లలకు అందుతుందో లేదో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర ఆందోళన చెందుతున్నారు. అయితే వీలైనంత త్వరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం తేవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.