Dengue Cases In Karimnagar: వానాకాలం రావడంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, జ్వరం, జలుబు లాంటివి ప్రతి ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగీ కేసులు విస్తృతంగా నమోదవుతున్నాయి. ఇప్పటికి దాదాపు 73 మందికి డెంగీ నిర్ధారణ అయినట్టుగా వైద్య అధికారులు తెలిపారు. ఒకవైపు వర్షాకాలం ప్రారంభం కావడం... మరోవైపు సరైన శానిటేషన్ లేక గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ డెంగ్యూ విస్తరిస్తోంది.


కత్తిమీద సాములా వైద్య సదుపాయాలు..
ఇప్పటివరకు కరోనా కారణంగా జిల్లావ్యాప్తంగా ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడం కత్తి మీద సాములాగా ఉండేది. అయితే వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం తగిన గుంతలలో , ప్రజలు వాళ్ల ఇళ్లల్లో ఆరు బయట ఉంచిన వస్తువులలో నీరు నిల్వ ఉండటంతో అవి దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణాల్లో కార్పొరేషన్  సిబ్బందితో సహా డ్రై డే పేరుతో వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి ఇంటిని చెక్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు కానీ మురుగునీరు  నిల్వ ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఉండే జనావాసాల ప్రజలు డెంగీ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇప్పటివరకు నగరంలోని ఆరు పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి.


ప్రజలు ఏం చేయాలంటే..
దోమల ఉత్పత్తికి ప్రధాన కారణమైన నీటి నిల్వను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంటి  ఆవరణలోనూ, స్లాబు పైన, ఇక పాత వస్తువులు, కొబ్బరిబొండాలు,  కూలర్లు, టైర్లు లాంటి వాటిలో నిల్వ ఉండే నీరు ఎప్పటికప్పుడు తొలగించాలి. అవసరమైతే వాడని వస్తువులను కొద్దికాలంపాటు వర్షానికి తడవకుండా దూరంగా ఉంచాలి. మంగళ, శుక్రవారాల్లో డ్రై డే ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.


ఏప్రిల్ నుంచి కేసులు..
డెంగీ కేసులు గత ఏప్రిల్ నుండి పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న సంఖ్య కంటే దాదాపు రెట్టింపుగా కేసులు నమోదై ఉంటాయని ఒక అంచనా. ఎక్కువ మంది జ్వరం వచ్చిన వెంటనే నిర్ధారణ చేయించుకుని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ఖచ్చితమైన సంఖ్య తెలియడం లేదని అధికారుల వాదన. ఇప్పటివరకు కరీంనగర్ పట్టణంతోపాటు మానకొండూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మరోవైపు జ్వరం నిర్ధారణ నుండి చికిత్స వరకూ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పది నుండి ఇరవై బెడ్‌లతో వార్డు సిద్ధం చేస్తున్నామని, అన్నిరకాల గ్రూపులతో కూడిన బ్లడ్ బ్యాంకులు సైతం అందుబాటులోకి తెస్తున్నామని... ఇక ఎలిసా టెస్ట్ కి సంబంధించి కిట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల జ్వరాలు రాకుండా నివరించుకోవచ్చని తెలిపారు.