Chicken Biryani Issue in Karimnagars Jaamikunta: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. తినడానికి తిండి లేదని ఎందరో ఇబ్బంది పడుతుంటారు. తిన్నది అరగక, అరిగించుకోలేక బాధపడేవారు సైతం ఉంటారు. అవకాశం దొరికితే సీజన్ ఏదైనా, సందర్భం ఏదైనా బిర్యానీ లాగించాలని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. అయితే తిన్న చికెన్ బిర్యానీలో ముక్క బాలేదని, సరిగ్గా ఉడకలేదని రెస్టారెంట్లలో ఫిర్యాదులు తరచుగా వింటూనే ఉంటాం. ఓ రెస్టారెంట్లో బిర్యానీలో చికెన్ బొక్క గట్టిగా ఉందని రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యంతో కస్టమర్ గొడవకు దిగడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఓ కస్టమర్ బిర్యానీ తినాలని, హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఆ వ్యక్తి చికెన్ బిర్యాని కొనుగోలు చేశాడు. అయితే బిర్యానీలో వచ్చిన బొక్కలు ఎంతకు బ్రేక్ కావడం లేదని, గట్టిగా ఉన్నవి వేశారంటూ కస్టమర్ రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. రెస్టారెంట్ యాజమాన్యం కలగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.
తనకు సర్వ్ చేసిన బిర్యానీలో చికెన్ ముక్కలు వేయలేదని, అందుకే చికెన్ బొక్కలు బ్రేక్ కావడం లేదని యాజమాన్యంతోనూ గొడవకు దిగాడు. వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి విషయం తెలుసుకున్నారు. కస్టమర్, హోటల్ యాజమాన్యం వాదన విన్నాక.. చికెన్ బొక్కలు కలెక్ట్ చేసుకుని ఫుడ్ ఇన్స్ స్పెక్టర్ కు పోలీసులు సమాచారం అందించారు. కస్టమర్ ను, రెస్టారెంట్ యాజమానిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఫుడ్ ఇన్ స్పెక్టర్ బిర్యానీ లెగ్ పీస్, ఇతర శాంపిల్స్ సేకరించారు. తీసుకున్న శాంపిల్స్ ను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపామని, రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో తీసుకున్న శాంపిల్స్ ఇవ్వాలని, రిపోర్టులు బహిర్గతం చేయాలని స్థానికులు, యూత్ లీడర్లు ప్రశ్నించారు. నాణ్యత లేకపోవడం, వేరే పదార్థాలు వాడారని కొన్ని హోటల్స్, రెస్టారెంట్లకు జరిమానా విధించినట్లు ఫుడ్ ఇన్ స్పెక్టర్ చెప్పారు.