వారంతా ఉపాధి కోసం డ్రైవింగ్ చేస్తున్నారు. కార్లను కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు అప్ అండ్ డౌన్ నడుపుతూ ఉంటారు. పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా ఆర్టీసీ నుండి బస్సులు పెరగకపోవడం, పండుగల సీజన్ కావడంతో వారాంతంలో ఇంటికి వచ్చిన ఐటీ ఉద్యోగులు... సోమవారం కాగానే ఉదయం ఆఫీస్‌లకు వెళ్ళే హడావుడిలో ఈ సేవలను వినియోగించుకోవడంతో క్రమక్రమంగా డిమాండ్ పెరిగింది. ఇందులో చాలామంది డ్రైవర్లు సొంతంగా వాహనం సమకూర్చుకొని తమ కుటుంబాన్ని సిటీకి తీసుకెళ్తున్నారు. అయితే కొందరు క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన మాత్రం దారుణంగా ఉందని ఆరోపణలున్నాయి.
ఓ ప్రభుత్వ ఉద్యోగి అతని భార్య హైదరాబాదు నుంచి వస్తున్న క్రమంలో డ్రైవర్ల రౌడీయిజం పీక్స్ కి చేరుకుంది. రవాణా శాఖ అధికారులకు చెబుతావా, పోలీసులకు చెప్పుకుంటావో? ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ రాయడానికి వీలు లేని రీతిలో దూషించాడు. చివరికి బెదిరింపులకు దిగే పరిస్థితికి చేరుకుంది. కనీసం కారులో మహిళ ఉందని చూడకుండా ఏకంగా కొద్ది నిమిషాల పాటు సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద గొడవకు దిగడం సైతం వచ్చిపోయే వాళ్ళని నివ్వెరపోయేలా చేసింది.
అసలేం జరిగింది?
కరీంనగర్ కి చెందిన ఒక ఉద్యోగి తన భార్యతో పాటు వ్యక్తిగత పనిపై హైదరాబాద్ వెళ్లారు. అయితే పండుగల సీజన్ కావడం... తిరిగి కరీంనగర్లో ముఖ్యమైన పనులు ఉండడంతో జూబ్లీ సమీపంలో రెగ్యులర్‌గా వెళ్ళే షేరింగ్ క్యాబ్ అయితే త్వరగా వెళ్ళొచ్చని భావించారు . మరోవైపు ఒకరికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికీ కలిపి వెయ్యి రూపాయలు ఇస్తే వెంటనే బయలుదేరుతానంటూ ఓ క్యాబ్ డ్రైవర్ తెలిపాడు. దీంతో అంగీకరించిన సదరు ఉద్యోగి క్యాబ్లో కూర్చున్న వెంటనే అసలు సమస్య మొదలైంది. అప్పటివరకు ఇద్దరితో బయలుదేరుతాను అన్న డ్రైవర్ మరో వ్యక్తి కోసం వెతికసాగాడు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే కరీంనగర్ వెళ్లడానికి సిద్ధమై ఉన్న మరో ప్రయాణికుడిని కూడా వెంటనే బయలుదేరుతామంటూ తన కారులో కూర్చోబెట్టాడు. అసలే పాతకారేమో భారీ సౌండ్ తో ఇంజన్ శబ్దం చేయసాగింది. అయినా వెంటనే వెళ్తానని అనడంతో చేసేదేమీ లేక ఆ ప్రయాణికులు అడ్జస్ట్ అయ్యారు.
ప్రయాణికులు ఎక్కినా ఆశ తీరలేదు..
భార్యాభర్తలతో పాటు మరో ప్రయాణికుడిని కారు ఎక్కించుకున్నా వారు ఏమీ అనలేదు. సర్దుకుని కూర్చుకున్నాక ఇక్కడ మొదలైంది మరో మోసం. ఇద్దరి నుండి ముగ్గురు వరకు ప్రయాణికులు ఎక్కినా ఆ డ్రైవర్ మరో ప్యాసింజర్ కోసం ఎదురుచూస్తూ ఉండడంతో సమయం గడిచిపోసాగింది. అదే సమయంలో ఓ ప్రైవేట్ కారు కరీంనగర్ కి వెళుతుండగా.. వెంటనే ఈ క్యాబ్ డ్రైవర్ వ్యవహారం భరించలేక అందులో వెళ్లిపోవాలని చూశారు అంతే ఇక అప్పుడు మొదలైంది క్యాబ్ డ్రైవర్ల అరాచకం. అందులో ఒకరిద్దరు డ్రైవర్లు గొడవ వద్దని వారిస్తున్నా, ఓ ముగ్గురు డ్రైవర్లు సదరు కారు వద్దకు వచ్చి ఎలా వెళ్తావో చూస్తామంటూ ఆ ప్రభుత్వ ఉద్యోగిని ఆయన భార్య ముందే బెదిరించడం మొదలుపెట్టారు. పైగా ఏ ఆఫీసర్ కి చెప్పుకుంటావో చెప్పుకో, మేం మాట్లాడతామంటూ వితండవాదానికి దిగారు.
వారి ప్రవర్తనకు మొదట ఆశ్చర్యపోయిన ఆ ప్రభుత్వ ఉద్యోగి తేరుకొని పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. సమయానికి 100 నుండి కూడా స్పందన రాకపోవడంతో కాసేపు మౌనం వహించారు. అయితే ఎంతకూ తగ్గని ఆ డ్రైవర్లు చివరికి బూతులు మాట్లాడుతూ బెదిరించడం కొనసాగించారు. ఒకానొక సమయంలో ప్రయాణికులపై దాడి చేస్తారేమో అన్నంతగా మారింది వారి వ్యవహార శైలి... మరోవైపు మెయిన్ రోడ్డుపైన గొడవ అవుతుండడంతో క్రమంగా ట్రాఫిక్ జామ్ కావడం ప్రారంభమైంది. అయినా తగ్గని క్యాబ్ డ్రైవర్ల బ్యాచ్ ప్రయాణికులను మాత్రం వదల్లేదు. చివరికి ఎదురుగా ఉన్న జూబ్లీ బస్టాండ్ లోని బస్సుల్లో వెళ్ళిపోతామని చెప్పినా కూడా అంగీకరించలేదు. రోడ్డుపైనే దిగి నడుచుకుంటూ వెళ్లాలంటూ ఆర్డర్లు జారీ చేశారు. తమకు ఆరోగ్యం సహకరించదని చెప్పినా వినకుండా విసిగించారు.
చివరికి మరోసారి పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నించడంతో ఆయనను బూతులు తిడుతూ అక్కడి నుండి నెమ్మదిగా జారుకున్నారు. జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా కలత చెందిన ప్రభుత్వ ఉద్యోగి తమలాంటి చదువుకున్న వారితోనే ఇలా ప్రవర్తిస్తే, అమాయకులు, ఇక అమాయకులైన వారితో, ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచే ఎలా ఫిర్యాదు చేయాలో కూడా అవగాహన లేని ప్రయాణికులను ఇంకెంత దోచుకుంటున్నారో అని వ్యాఖ్యానించారు. తమకు సమయం కలిసి వచ్చేలా తీసుకెళ్తున్నారని., క్యాబ్ డ్రైవర్లు కాస్త ఎక్కువ అడిగినా, పాపం కదా అని ప్రయాణికులు వెళ్లడానికి సిద్ధపడుతుంటే వారిపై దౌర్జన్యం చేయండ సరికాదన్నారు. కొందరు క్యాబ్ డ్రైవర్ల తీరుతో అందరికీ సమస్య తెచ్చి పెట్టేలా ఉందని క్యాబ్ డ్రైవర్లు అంటున్నారు.