Karimnagar BRS News: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. ముస్తాబాద్ లో జెడ్పీటీసీ, మాజీ జడ్పీటీసీ, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కండువా కప్పి అందర్నీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 


గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తుందని అన్నారు. కేటీఆర్ ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతో మాట్లాడి తొలగింప చేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ అసమర్థత వల్లనే తొమ్మిదో ప్యాకేజీ పనులు నిలిచి పోయాయని అన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని పొన్నం చెప్పారు.


‘‘నేరుగా ఎమ్మెల్యే అయి, కేసీఆర్ కుమారుడిగా మంత్రి అయినావు. మంత్రి పదవి పోగానే మనసున పడతలేదు. కాంగ్రెస్ పార్టీ తప్ప దేశానికి, రాష్ట్రానికి ప్రజాస్వామ్య బద్దంగా పాలించే పార్టీ లేదు. గతంలో ప్రజా సమస్యలపై ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు మంత్రిగా వచ్చాను. ముఖ్యమంత్రి నుంచి అప్పర్ మానేరు అభివృద్ధి పనుల విషయంపై హామీ తీసుకున్నాం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.