BJP MP Bandi Sanjay: బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత పోస్టులు పెట్టడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చనిపోయిన వ్యక్తికి నివాళులర్పిస్తున్న విధంగా ఇక సెలవు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపించాయి. గంజాయి బ్రోకర్ అంటూ తీవ్ర పదజాలంతో కేటీఆర్ టిఆర్ఎస్ అనే అకౌంటు నుండి పోస్ట్ పబ్లిష్ అయింది. దీనిపై ఆగ్రహించిన కరీంనగర్ బీజేపీ నేతలు టౌ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్ పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
ఇక సెలవు అంటూ బండి సంజయ్ పై దారుణమైన పోస్టులు..
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆయనకు, పార్టీ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్టమెంట్ పార్టీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం జ్యోతి నగర్ లోని ఎంపీకి చెందిన ఆఫసీులో ఉన్న సమయంలో తాను సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూసినట్లు తెలిపారు. కేటీఆర్ టీఆర్ఎస్ అనే ఫేస్ బుక్ ఐడీ నుంచి ఎంపీ బండి సంజయ్ చనిపోయారంటూ పోస్ట్ చేసినట్లు గమనించాను. చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నట్లుగా బండి సంజయ్ ఫొటోను పెట్టి.. ఇక సెలవు అని పోస్ట్ చేశారు.
గంజాయి బ్రోకర్ అంటూ దారుణమైన వ్యాఖ్యలు పోస్టులో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ బండి సంజయ్ చనిపోయారని పోస్ట్ పెట్టి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు, పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా పోస్ట్ పెట్టిన కేటీఆర్ టీఆర్ఎస్ అనే ఐడీ కలిగిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు బోయినపల్లి ప్రవీణ్ రావ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫేస్ బుక్ పోస్ట్ ను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జత చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని గులాబీ నేతలు దీమాగా ఉన్నారు. ఈ క్రమంలో పలుమార్లు బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కానీ తాజాగా బండి సంజయ్ ను రాష్ట్రంలో గంజాయి బ్రోకర్ అని, ఇక సెలవు అంటూ చనిపోయిన వారికి నివాళి అర్పిస్తున్నట్లుగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ నేతల పనేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.